Begin typing your search above and press return to search.

లోకేష్ సార్‌.. మంగ‌ళ‌గిరి వ‌ద్దు...!

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:30 AM GMT
లోకేష్ సార్‌.. మంగ‌ళ‌గిరి వ‌ద్దు...!
X
తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లే అంటే.. స‌రిపోయే రోజులు కావివి! ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మార్చు కుంటేనే రాజ‌కీయంగా నిల‌దొక్కుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. శ‌ప‌థాలు.. అన్ని స‌మ‌యాల్లోనూ వ‌ర్కువుట్ కావు. స్థానం.. ప్ర‌జ‌ల అభిమానం.. ఈ రెండు రాజ‌కీయ నేత‌ల‌ను శాసిస్తున్నాయి. ఈ విష‌యంలో టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌నే కామెంట్లు జోరుగా వినిపి స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకునేందుకు లోకేష్ తీవ్రంగానే శ్ర‌మించారు. అయితే.. ఆయ‌న తొలి పోటీలోనే ఓట‌మిని కౌగిలించుకున్నారు.

అయితే.. అప్ప‌ట్లో వ్యూహాత్మ‌కంగా అన్నారో..ఆవేశంతో అన్నారో తెలియ‌దు కానీ.. మ‌ళ్లీ మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేసి.. విజ‌యం ద‌క్కింంచుకుని వైసీపీకి షాకిస్తాన‌ని చెప్పారు. నిజ‌మే .. అప్ప‌టి ప‌రిస్థితి వేరు. కానీ, ఈ మ‌ధ్య కాలంలో ఇక్క‌డ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరిగిపోయాయి. మ‌రోవైపు సామాజిక వ‌ర్గం ప‌రంగా చూసుకున్నా..చేనేత‌లు ఎక్కువ‌గా ఉన్న ఇక్క‌డ బ‌ల‌మైన నేత‌ను వైసీపీ త‌న పంచ‌కు చేర్చుకుంది. అంటే.. దాదాపు లోకేష్‌ను మ‌రోసారి ఓడించేందుకు వైసీపీ ఇప్ప‌టికే పావులు సిద్ధం చేసుకుంది.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ హ‌వా పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌చ్చు. పోనీ.. రాజ‌ధానిని న‌మ్ముకున్నాం.. క‌దా.. అంటే.. అది గ‌త ఎన్నిక‌ల్లోనే తేలిపోయింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. లోకేష్‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకుంటే ఇప్ప‌టి నుంచి ఆయ‌న గ‌ట్టెక్కేందుకు బాగుంటుంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు చంద్ర‌బాబు, పార్టీకి ఎంత ముఖ్య‌మో.. లోకేష్ కు త‌న‌ను తాను నిరూపించుకునేందుకుఅంత‌క‌న్నా ముఖ్య‌మ‌ని చెబుతున్నారు.

పార్టీ ఓడిపోయినా.. అధికారం మ‌రోసారి ద‌క్క‌క పోయినా.. చివ‌ర‌కు చంద్ర‌బాబే ఓడిపోయినా.. ఫ‌ర్వాలేదు. కానీ.. లోకేష్ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీర‌క‌పోతే.. పార్టీపైనా ఆయ‌న నాయ‌క‌త్వంపైనా సుధీర్ఘ‌మైన ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.మరి ఆయ‌న వ్యూహాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి.