Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌పై అల‌క‌.. రేణుక హ్యాండిచ్చారుగా!

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:37 AM GMT
సీనియ‌ర్ల‌పై అల‌క‌.. రేణుక హ్యాండిచ్చారుగా!
X
ఆమె క‌దిలే నిప్పు క‌ణం. నోరు విప్పితే నిప్పులు కురువాల్సిందే. విప‌క్షాల‌కు చెక్ పెట్టాల్సిందే. ఆవిడే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీమంత్రి రేణుకాచౌద‌రి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన నాయ‌కురాలిగా ఎలాంటి వారిపైనైనా దూకుడు చూపించే సీనియ‌ర్ నేత‌గా ఆమెకు పేరుంది.

అయితే, పార్టీ ఇప్పుడు క్లిష్ట ప‌రిస్తితిని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఆమె ఊసు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆమె మాట కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంద‌రు ఆమె ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నార‌నే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చార‌ప‌ర్వానికి మ‌రో రెండు రోజుల్లో తెర‌ప‌డ‌నుంది.

ఇక్క‌డ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న అంద‌రినీ ఆమె ఆహ్వానించారు. పేరు పేరునా ఫోన్లు చేసి 'రండి.. వ‌చ్చి ప్ర‌చారం చేయండి.. స‌హ‌క‌రించండి' అని పిలిచారు. ఈ జాబితాలో పాత కొత్త అంద‌రూ ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా రేణుక వంటి ఫైర్ బ్రాండ్‌ను వ‌దులుకునేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు క‌దా! అందుకే స్ర‌వంతి త‌న నామినేష‌న్ రోజు నుంచి ప‌దే ప‌దే ఆమెకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ''రండ‌క్కా.. వ‌చ్చి హెల్ప్ చేయండ‌క్కా!!'' అని పిలుస్తూనే ఉన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు రేణుక క‌నీసం మునుగోడు విష‌యంపై ఒక్క‌మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. ఒక‌వైపు మునుగోడు ప్ర‌చారం సాగుతుంటే ఆమె ఏపీలోని అమ‌రావ‌తిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

అక్కడ రైతులు ప్రారంభించిన మ‌హాపాద‌యాత్ర 2.0లో పాల్గొని ర‌థం న‌డిపి జోష్ నింపారు. మంచిదే.. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కాంగ్రెస్ కూడా అమ‌రావ‌తి వైపే మొగ్గు చూపుతు న్న‌ప్పుడు రేణుక వంటి వారు అందులో జోక్యం చేసుకోవ‌డం కాంగ్రెస్‌కు అంతో ఇంతో క‌లిసి వ‌చ్చేదే.

అయితే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అంత‌కు మించిన వ్య‌వ‌హారం క‌దా! అనేది ఇక్క‌డినేత‌ల మాట‌. కానీ, రేణుక మాత్రం దీనిని లైట్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం.. పార్టీలోని ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లకు ఆమెకు మ‌ధ్య కొన‌సాగుతున్న వైర‌మేన‌ని తెలుస్తోంది. భ‌ట్టి విక్ర‌మార్క‌కు రేణుక‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. ఇప్పుడు మునుగోడులో భ‌ట్టి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో రేణుక రావ‌డం లేద‌నే టాక్ ఉంది. అదేస‌మ‌యంలో రేవంత్ రెడ్డి పార్టీ బాధ్య‌త‌లు తీసుకున్నాక అంద‌రినీ క‌లిసినా.. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌లేద‌నే ఆవేద‌న కూడా రేణుక‌కు ఉంది. పైకి ఎవ‌రైనా ఓకే అన్న‌ప్ప‌టికీ .. టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి ప‌ద‌విని ఇవ్వ‌డాన్ని ఆమె తొలుత ఖండించారు. ఇప్పుడు రేవంత్ మునుగోడులో చ‌క్రం తిప్పుతున్నారు. వెర‌సి.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే రేణుక మునుగోడుకు దూరంగా ఉన్నారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా కీల‌క స‌మ‌యంలో రేణుక వంటి ఫైర్ బ్రాండ్ లేక‌పోవ‌డం కాంగ్రెస్‌కు పెద్ద‌లోటేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.