Begin typing your search above and press return to search.

ఆయన మౌనం : ఆమంచితనం నిలిచేనా...?

By:  Tupaki Desk   |   19 May 2022 9:30 AM GMT
ఆయన మౌనం : ఆమంచితనం నిలిచేనా...?
X
ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఆయన కీలక నాయకుడు. దివంగత మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా కూడా పేరు ఆయనకు ఉంది. ఒకానొక సమయంలో ప్రధాన పార్టీలని ఢీ కొట్టి మరీ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచిన సత్తా ఆయనది. ఆయనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్. ఆయన ఇపుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల టాక్. ఆమంచి జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ 2019 ఎన్నికల వేళ మీడియాలో బాగా ఫోకస్ అయ్యేవారు.

ఆయన బాంబుల్లాంటి స్టేట్మెంట్స్ తో నాటి బాబు సర్కార్ ని మీద దూసుకుపోయేవారు బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి నాడు టీడీపీ వైపు నుంచి వచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతోనే 2019 ఎన్నికల వేళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిన నేపధ్యం ఉంది. ఇక ఆయనతో పాటే గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులు వంటి వారు కూడా టీడీపీకి దెబ్బ కొట్టి మరీ పార్టీని వీడారు, వైసీపీలో చేరారు.

ఇలా ఆమంచి జగన్ సీఎం కావాలని తన వంతుగా కృషి చేశారు. అయితే బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆయన అంతటి జగన్ వేవ్ లో కూడా చీరాలలో ఓడిపోయారు. అయినా కానీ ఆయన అక్కడ వైసీపీకి బలమైన నేతగా ఉంటూ వచ్చారు. కానీ 2020 మార్చిలో జరిగిన అనూహ్యమైన పరిణామాల వల్ల వైసీపీకి ఆమంచి మెల్లగా దూరం అవుతూ వస్తున్నారు అని అంటున్నారు.

నాడు టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం, తన కుమారుడు వెంకటేష్ తో కలసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమంచికి చీరాలలో బద్ధ రాజకీయ వైరం ఉన్న కరణం ఫ్యామిలీ వైసీపీ గూటికి చేరడంతో నాటి నుంచే ఆమంచి పూర్తిగా డల్ అయిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో చీరాల టికెట్ తనకు దక్కుతుంది అనుకుంటే ఆమంచి ఆశలను అడియాశలుగా చేస్తూ కరణం ఫ్యామిలీకే దాన్ని కేటాయించారని తెలుస్తోంది.

ఇక ఆమంచిని పరుచూరు వెళ్ళి పోటీ చేయాలని కూడా ఈ మధ్య జగన్ పిలిపించుకుని మరీ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ చీరాల విడిచి వెళ్లేది లేదని ఆమంచి అంటున్నారు. కానీ అది కరణం ఫ్యామిలీకి ఇచ్చేసిన వైసీపీ హై కమాండ్ ఆమంచికి పరుచూరి ఒక్కటే ఆప్షన్ చూపించింది అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఆమంచి వైసీపీని వీడేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన చూపు జనసేన మీద పడింది అని కూడా చెబుతున్నారు. బలమైన కాపు నాయకుడిగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఉన్న‌ ఆమంచి వంటి వారు వస్తే జనసేన ప్రకాశం జిల్లాలో బలపడడం ఖాయం. దాంతో ఆమంచిని ఆపేందుకు ఇపుడు వైసీపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు.

ఈ కీలకమైన సమయంలో ఆమంచి పార్టీని వీడితే అది బ్యాడ్ సిగ్నల్స్ ని కూడా ఇస్తుంది అంటున్నారు. అయితే వైసీపీలో ఉంటే చీరాల టికెట్ మాత్రమే కావాలని లేకపోతే లేదు అని పట్టుబడుతున్న ఆమంచిని దారికి తేవడం అంత సులువు కాదు అనే అంటున్నారు. కరణం ఫ్యామిలీకి వైసీపీలో అధిక ప్రయారిటీ ఇచ్చి మొదటి నుంచి ఉన్న ఆమంచిని సైడ్ చేస్తున్నారు అన్న వేదన ఆయన అనుచరులలో ఉంది అంటున్నారు.

మొత్తానికి 2019 ఎన్నికల వేళ వైసీపీకి ఊపు తేవడానికి ఆమంచి పార్టీలో చేరిక ఉపయోగపడింది. ఇపుడు 2024 ఎన్నికల ముందు ఆయన కీలక నిర్ణయం తీసుకుంటే అది రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది అంటున్నారు. మొత్తానికి వైసీపీకి ఆమంచితనం నిలిచేనా అంటే జవాబు కోసం వేచి చూడాల్సిందే.