Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కాటసాని?

By:  Tupaki Desk   |   10 April 2018 4:49 PM GMT
వైసీపీలోకి కాటసాని?
X
పాణ్యం మాజీ ఎమ్మెల్యే - బీజేపీ రాష్ట్ర నాయకుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఆయనకు లైన్‌ క్లియర్‌ అయినట్లు చెబుతున్నారు. ఆయన ఈ నెల 18న కర్నూలులో కార్యకర్తలు - అనుచరులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు.

కాటసాని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి పాణ్యం నుంచి 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989లో - 1994లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో పార్థసారథిపై గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి భైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిపై గెలుపొందారు.

మొదటి నుంచి కాంగ్రెస్‌ వాదిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 30వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 18న సమావేశమవుతున్నట్టు అనుచరులు చెప్తున్నారు.