Begin typing your search above and press return to search.

ఆ మాజీ ఎమ్మెల్యేను కరోనా చంపలేదట.. కొడుకు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:30 AM GMT
ఆ మాజీ ఎమ్మెల్యేను కరోనా చంపలేదట.. కొడుకు సంచలన వ్యాఖ్యలు
X
రాజకీయాల గురించి.. అందులో ఉండాల్సిన మంచితనం గురించి.. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలనే దానికి సంబంధించిన గంటల కొద్దీ క్లాసులు పీకే వారు.. నీతులు చెప్పేవారు.. ఆదర్శాలు వల్లించేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మరణం గురించి మాట్లాడారా? కరనాతో మరణించిన ఆయన గురించి కన్నీటి బొట్టు కార్చారా? చివరకు నిత్యం ఆదర్శాలు వల్లె వేసే మీడియా సంస్థలు సైతం.. ఆయన మరణం సందర్బంగా అయినా.. తెలుగునేల మీద ఉన్న ఆదర్శవంతమైన రాజకీ నాయకుడు మరణిస్తే.. ఆ విషయాన్ని అదే పనిగా ప్రస్తావిస్తూ.. అతడి గొప్పతనాన్ని.. ఆదర్శాల్ని.. సింప్లిసిటీని కీర్తిస్తూ కథనాలు ప్రసారం చేశారా? పేపర్లో సైతం.. లోపలి పేజల్లో రెండు.. మూడు కాలమ్స్ లో వార్తను ఇచ్చారే కానీ.. పట్టించుకున్న పాపాన పోలేదు.

నీతిగా.. నిజాయితీగా.. ప్రజల కోసం.. వారి సంక్షేమం కోసం తపించే సున్నం రాజయ్య కరోనాతో చనిపోయినట్లు చెబుతున్నా.. ఆయన మరణానికి కారణం వేరే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కుమారుడు. సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా వ్యవహరించినా.. సరైన ఇల్లు లేని ఆయన్ను కరోనా చంపలేదని.. ఆయన అమితంగా ప్రేమించి.. అభిమానించిన ఆయన చుట్టూ ఉండే ప్రజలే చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సున్నం రాజయ్య కుమారుడు విడుదల చేసిన ఆడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

కరోనా సోకిన తన తండ్రి విషయంలో తమ గ్రామంలోని వారు వివక్ష చూపించారని.. తమ ఇంట్లో తొలుత తమ అక్కకు కరోనా సోకిదని.. దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలాచూడటం మొదలు పెట్టారన్నారు. ఆయన వస్తున్నప్పుడు తలుపులు మూసేయటం లాంటివి చేశారన్న వేదనను వ్యక్తం చేశారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయారని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ఈ క్రమంలో ఆయనలో విపరీతమైన ఆందోళన నెలకొందని చెప్పారు.

ఏ ప్రజల కోసం తన తండ్రి పాటుపడ్డారో.. వారే తనను దూరం పెట్టటాన్ని తట్టుకోలేకపోయారన్నారు. తన తండ్రికి కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రజలు పలుకరిస్తూ.. ధైర్యం చెప్పి ఉంటే ఆయన బతికి ఉండేవారేమోనన్న ఆయన.. తన తండ్రికి ఉద్యమాలే ఉపిరిగా బతికారని చెప్పారు. అందుకే తన పేరును సీతారామరాజుగా పెట్టారన్నారు. వ్యవస్థలో మార్పు కోసం.. పేద ప్రజల కోసం పోరాడిన ఒక ఆదర్శవంతమైన నేతను తమ అవగాహన రాహిత్యంతో ప్రజలే చంపుకోవటానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది. ఇలాంటి ఉదంతాలు చూసిన వారెవరైనా ప్రజల కోసం తపిస్తారా? వారి బాగు కోసం నడుం బిగిస్తారా?