Begin typing your search above and press return to search.
జగన్ తర్వాత ముందు పార్టీ సంగతి చూడు బాబు
By: Tupaki Desk | 10 Jun 2018 9:42 AM GMT``ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో షాక్ తినడం ఖాయమే. ఆయన సొంత జిల్లా అయిన కడపలోనే టీడీపీ స్వీప్ చేస్తుంది. అంతేకాదు పులివెందుల నియోజకవర్గంలోనే వైసీపీ ఓటమి ఖాయం`` ఈ మాటలు ఎవరివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు మొదలుకొని ఆయన తనయుడైన మంత్రి లోకేష్ సహా మీడియాలో కనిపించాలని ఆరాటపడే టీడీపీ నాయకులందరివీ!! అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఇలాంటి కామెంట్లే వారికి బూమరాంగ్ అయ్యాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్‌కు షాక్ ఇవ్వడం సంగతి అలా ఉంచితే...టీడీపీ శ్రేణలు మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని స్పష్టం చేస్తున్నారు.
ఇంతకీ...టీడీపీ శ్రేణుల గురించి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటే...కడప టీడీపీలో రచ్చ రచ్చగా మారుతున్న పరిస్థితులే. ఒకదానివెంట ఒకటి అన్నట్లుగా కడప టీడీపీ అంతర్గత రాజకీయాలు రచ్చకు ఎక్కుతున్నాయి. మంత్రి వర్సెస్ సీనియర్ నేత అన్నట్లుగా మారిన వివాదానికి తాజాగా ఎంపీ వర్సెస్ పార్టీ నాయకుడు అనే వివాదం చేరింది. ఇప్పటికే కడపలో జంప్ జిలానీ మంత్రి ఆదినారాయరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వివాదం తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మహానాడులో ఈ ఇద్దరు నేతల మధ్య విబేధాలను చూసి పార్టీ నేతలే అవాక్కయ్యారు. ఆఖరికి సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నప్పటికీ...ఈ ఇద్దరు నేతల మధ్య పరిస్థితి సద్దుమణగడం లేదని చెప్పడం అతిశయోక్తేం కాదు.
అయితే, అదే రీతిలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. టీడీపీ సీనియర్ నేత - పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడనే పేరున్న ఎంపీ సీఎం రమేష్ పై మాజీ ఎమ్మెల్యే - ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీకి ఎక్కువ...! మండలానికి తక్కువ అయిన సీఎం రమేష్... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దయతో రాజ్యసభకు ఎన్నికయ్యారంటూ విమర్శించారు. వర్గ రాజకీయాలతో పార్టీలో చిచ్చుపెట్టడమే కాకుండా... అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేష్... బద్వేల్ లో ఓ గ్రూప్ - ప్రొద్దుటూరు - జమ్మలమడుగు - రాయచోటి - కమలాపురం - పోడూరు - రాజంపేట... ఇలా అన్ని ఏరియాల్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రెచ్చగొడుతున్నారని వరదరాజులు రెడ్డి ఆరోపించారు. ``జిల్లాలో గురించి నీకు ఎందుకు? పార్టీ అధినేత చంద్రబాబు... పార్టీ ఇంఛార్జ్ లను పెట్టారు - జిల్లా అధ్యక్షుడిని పెట్టారు.... నీకు గ్రూపులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? గుంపులను రెచ్చగొట్టాల్సిన పనేంటి? పార్టీని నాశనం చేయడానికే నీకు రాజ్యసభ సీటు ఇచ్చారా? అంటూ సీఎం రమేష్ పై మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని నీకు ఇక్కడి రాజకీయాలతో పనేంటి అని వరదరాజులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని సైతం తప్పుపట్టారు.
స్థూలంగా బాబు సన్నిహితుడనే పేరున్న నాయకుడిపైనే పార్టీ సీనియర్ నేత విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. పైగా చంద్రబాబు నిర్ణయాన్నే దిక్కరించేలా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని కూడా పంపిస్తోంది. ఓవైపు మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ - మరోవైపు ఎంపీ వర్సెస్ నియోజకవర్గ ఇంచార్జీ అన్నట్లుగా జరుగుతున్న పంచాయతీలతో టీడీపీ కుదేలు అయిపోతుంటే..సీఎం చంద్రబాబు మాత్రం కడపలో వైసీపీని గల్లంతు చేస్తామని చెప్పడం జోక్ కాక మరేమిటి అవుతుందని పలువురు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ శ్రేణులు ఏ విధంగా కవర్ చేస్తాయో మరి!