Begin typing your search above and press return to search.

సీఎం రమేశ్‌ పై సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   9 Jun 2018 3:18 PM GMT
సీఎం రమేశ్‌ పై సంచలన ఆరోపణలు
X
అసలే రాయలసీమలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగులేదు. 2019 ఎన్నికల్లో అక్కడ పట్టుమని పది సీట్లయినా వస్తాయో లేదో తెలియదు. అలాంటి చోట నేతలంతా సమన్వయంతో సాగిపోవాలంటూ సీఎం చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. కానీ, అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు. అటు అనంతలో పార్టీ నేతల మధ్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. కర్నూలు - చిత్తూరు అంతటా అదే పరిస్థితి. ఇక విపక్ష నేత సొంత జిల్లా కడపలో అయితే టీడీపీలో ఇప్పటికే వర్గ పోరు తీవ్రంగా ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజలు రెడ్డి - రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ మధ్య వివాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలోనే వరదరాజులు రెడ్డి సీఎం రమేశ్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. రమేశ్ వైసీపీ మద్దతుదారని.. ఆయన నిత్యం వైసీపీ అధినేత జగన్‌ తో టచ్‌ లో ఉంటారని ఆరోపించారు.

‘సీఎం రమేష్ స్థాయి పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ, మండలి ఎన్నికలకు తక్కువ. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రమేష్ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నార’ని ఆరోపించారు. టీడీపీ విజయావకాశాలను ఆయన దెబ్బ తీస్తున్నారని.. సీఎం చంద్రబాబు దయ వల్లే ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారని అన్నారు. ఆయన నామినేటెడ్ పదవులతో పబ్బం గడుపుకోవడమే కానీ.. ప్రత్యక్ష ఎణ్నికల్లో పోటీ చేసి గెలవలేరని అన్నారు. రమేశ్ ది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ అని ఆయన ఆరోపించారు.

అయితే.. వరదరాజులు రెడ్డి ఇప్పుడు ఇంతగా బరస్ట్ అయినప్పటికీ వారిద్దరి మధ్య గొడవలు ఈనాటివి కావని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇద్దరి మధ్య వ్యాపార పరమైన గొడవలున్నాయని చెబుతున్నారు. వరదరాజులు రెడ్డి చేసిన కాంట్రాక్టులకు బిల్లులు రాకుండా రమేశ్ అడ్డుపడుతుండడంతో ఇద్దరి మధ్య గొడవలున్నాయని అంటున్నారు. కాగా కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి - రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య కూడా ఎన్నిసార్లు సయోధ్య చేసినా ఇంకా అది ఆరని మంటగానే ఉంది. రాయలసీమ జిల్లాలంతటా ఇలా నేతల మధ్య సయోధ్య కొరవడడంతో టీడీపీ అధినేత చంద్రబాబులో టెన్షన్ మొదలైంది.