Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు

By:  Tupaki Desk   |   29 April 2022 11:30 PM GMT
కేసీఆర్ కు షాకిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అసమ్మతి సెగ తగులుతోంది. ఆయన ఎంత కాదనుకుంటున్నా రోజురోజూకీ గళమెత్తుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జూపల్లి కృష్ణారావు, వేముల వీరేశం, పుట్టా మధు, పట్నం మహేందర్ రెడ్డిలు దిగ్గజ నేతలంతా అధికార పార్టీలో ఉంటూనే అసమ్మతి గళం వినిపిస్తున్నారు.

మొన్నటివరకూ మంత్రి పదవులు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉండగా.. ఇప్పుడు మాజీలు మౌన పోరాటం అందుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇంటిపోరుతో ఇబ్బందిపడుతున్న పలువురు మాజీలను కాంగ్రెస్, బీజేపీలు తమవైపు లాక్కునే పనిలో పడ్డాయి.

గులాబీ అధిపతి కేసీఆర్ కు.. రెబల్స్ తోపాటు కేబినెట్ బెర్త్ దక్కనివారి నుంచి తలనొప్పులు ఉంటాయని.. ఆశించి భంగపడ్డ వారు అసమ్మతి రాజేస్తారని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ కు ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన కొందరు మాజీలయ్యారు. వీళ్లలో కొందరు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. గత కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయిన తుమ్మల ప్రస్తుతం పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులు తాజాగా టీఆర్ఎస్ పై గళమెత్తుతున్నారు. వారి ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఈ ముగ్గురు నేతలు ఖమ్మంలో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సారి ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక తుమ్మల కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. పైగా పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సీనియర్లను అధిష్టానం పట్టించుకోవడం లేదన్న ఆవేదన తుమ్మల, జూపల్లి, పొంగులేటి లో ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లో టికెట్ వచ్చినా రాకున్నా తమ దారి తాము చూసుకునేందుకు ఈ నేతలు రెడీ అయినట్లు సమాచారం.

ఇక ఈ ముగ్గురే కాదు.. డమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జూపల్లి కృష్ణారావు, వేముల వీరేశం, పుట్టా మధు, పట్నం మహేందర్ రెడ్డిలు ప్రతీసారి జిల్లాలో అసమ్మతి రగిలిస్తూనే ఉన్నారు. వీరి స్థానంలో వేరొకరు రావడం.. వారు వీరిని కాదని అధికారాన్ని అనుభవిస్తుండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఓవర్ లోడ్ తో సాగుతున్న టీఆర్ఎస్ లో వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది గళమెత్తే చాన్స్ కనిపిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బయట నుంచి వచ్చిన నేతలు కొత్త వారితో టీఆర్ఎస్ టైట్ అయ్యింది. మరింత మంది గళమెత్తే అవకాశాలు ఉన్నాయి.