Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఒకటనుకుంటే.. మరొకటైంది..

By:  Tupaki Desk   |   9 May 2019 11:51 AM GMT
కేసీఆర్ ఒకటనుకుంటే.. మరొకటైంది..
X
కేసీఆర్ అనుకున్నదొకటి.. ఇప్పుడు అయ్యిందొక్కటి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుందామని వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్సీల అనర్హత మరోసారి వివాదాస్పదమైంది.

గత డిసెంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ వేళ టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్ లకు ఊరట లభించింది. పార్టీ మారారని టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గద్దెనెక్కగానే వారిపై అనర్హత వేటు వేసి పదవుల నుంచి తొలగించింది.

అయితే తమను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు ముగ్గురు ఎమ్మెల్సీలు. ఈనెల 15వ తేదీ వరకూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకూడదని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

అనర్హత వేటు విషయంలో కనీసం శాసనమండలి చైర్మన్ తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని వారు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వారి స్థానంలో ఈసీ కొత్త వారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీ వరకు కూడా కోర్టు అనుమతి లేకుండా నోటిఫికేషన్ వేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి.