Begin typing your search above and press return to search.
రాజకీయ గీత మారింది...ఎంపీ హోదా నుంచి జైలు దారి
By: Tupaki Desk | 14 Sep 2022 12:30 PM GMTఆమె వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది మంది ఎంపీలలో ఒకరు. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి చూస్తే ఏకైక ఎంపీగా విజయం సాధించి రికార్డు సాధించారు. ఆమె పూర్వాశ్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చి తొట్టతొలిగా వైసీపీని చాయిస్ గా ఎంచుకుని రాజకీయ అరంగేట్రం చేశారు. జగన్ సైతం ఆమెకు బాగానే అవకాశం ఇచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ ని మూడవ స్థానంలోకి నెట్టి టీడీపీ అభ్యర్ధిని గుమ్మడి సంధ్యారాణి మీద 91,398 వేల ఓట్ల మెజారిటీతో కొత్తపల్లి గీత గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
అలా ఎందరికో కల లాంటి పార్లమెంట్ సభ్యత్వం ఆమెకు అలా వరంగా లభించింది. అయితే ఆమె తరువాత కాలంలో టీడీపీకి దగ్గర కావడంతో పాటు వైసీపీ మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీ దూరం పెట్టింది. కేంద్రంలో నాడు బీజేపీ అధికారంలో ఉండడంతో వారితో సన్నిహితంగా గీత మెలుగుతూ వచ్చారు. ఇక బీజేపీలో ఆమె చేరుతారు అనుకుంటే 2019లో జన జాగృతి పేరిట పార్టీని స్థాపిస్తున్నట్లుగా విజయవాడలో ప్రకటించారు.
ఆ పార్టీ తరఫున ఆమె 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లాలో తన అభ్యర్ధులను నిలబెట్టారు. అలా రాజకీయాల్లో తమ మార్క్ చూపించాలనుకి ఆమె వెనక్కి వెళ్లారు. తాజాగా ఆమె మళ్ళీ హైదరాబాద్ కి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ద్వారా బీజేపీలోకి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆమె మీద సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం చర్లపల్లి జైలుకు ఆమెతో పాటు భర్తకు కూడా కలిపి పంపించడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో సంచలనం రేగింది.
కొత్తపల్లి గీత 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా అరకు నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె మీద ఇపుడు సీబీఐ పెట్టిన కేసులు కానీ ఆమె అరెస్ట్ కానీ రాజకీయంగా తీరని నష్టాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ వారు ఆమెను తీసుకోవాలా వద్దా అని ఆలోచన చేస్తున్న నేపధ్యంలో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయడంతో ఇక రాజకీయంగా ఆమెకు దారులు మూసుకుపోయాయా అన్న చర్చ వస్తోంది.
ఇదిలా ఉంటే ఆమె ఇపుడు బీజేపీలో చేరాలనుకోవడం వెనక కూడా ఇలాంటి అరెస్టులను తప్పించుకోవాలనే వ్యూహమా అన్న మాట కూడా మరో వైపు వినిపిస్తోంది. బీజేపీ ఏలుబడిలో చాలా మంది బిగ్ షాట్స్ ని జైలుకు పంపిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్ధులను వారు అసలు స్పేర్ చేయడంలేదు. కొత్తపల్లి గీత బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నా కూడా ఆమె అరెస్ట్ కావడం బట్టి చూస్తే ఆ పార్టీ ఆమెను చేరదీయడం లేదని చెప్పినట్లు అయింది అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేశారన్న దాని మీద కచ్చితమైన ఆధారాలు సీబీఐ సేకరించిందని దాని ఫలితంగానే ఈ అరెస్టులు జరిగాయని చెబుతున్నారు. మాజీ ఎంపీ ఈ బ్యాంక్ నుంచి 52 కోట్ల రూపాయలు రుణం తీసుకొని ఎగ్గొట్టిన కారణంగానే హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానాను విధించింది. దీంతో ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. అంతే కాదు ఈ కేసులో మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను సీబీఐ కోర్టు ఖరారు చేసింది.
నిజానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి 2015లోనే సీబీఐ ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. అపుడు ఆమె వైసీపీ ఎంపీగా ఉన్నారు. బహుశా ఈ కేసు తరువాతనే ఆమె కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ వచ్చారని అంటున్నారు. మరి ఏమైందో ఏమో కానీ ఈ కేసు ఏడేళ్ళ తరువాత తీర్పునకు నోచుకోవడం శిక్షలు ఖరారు కావడం జరిగిపోయాయి.
కాగా బ్యాంకు నుండి రుణం పొందేందుకు నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చార్జీషీట్‌లో సీబీఐ పేర్కొంది. వాస్తవాలను అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు దాచారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో బెయిల్ కోసం ప్రస్తుతం మాజీ ఎంపీ ప్రయత్నం చేస్తున్నారు. అయితే బెయిల్ లభిస్తుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఎంపీగా ఉంటూ దర్జాగా అధికార వైభోగాలు అనుభవించి మరింతగా రాజకీయ భవిష్యత్తుని దిద్దుకోవాల్సిన మాజీ ఎంపీ గీత ఇలా జైలు రాతగా మారడం పూర్తిగా స్వయంకృతమే అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.