Begin typing your search above and press return to search.

బోటు ప్రమాదంపై కొత్త రచ్చ..హర్ష కుమార్ వర్సెస్ అవంతి

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:11 PM GMT
బోటు ప్రమాదంపై కొత్త రచ్చ..హర్ష కుమార్ వర్సెస్ అవంతి
X
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పాపికొండల యాత్రకు వెళ్లిన యాత్రికులను ముంచేసిన బోటు ప్రమాదంపై కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటిదాకా బోటు ప్రమాదంలో మరణించిన వారెందరు? సురక్షితంగా బయటపడ్డవారెందరు? గల్లంతై ఇంకా ఆచూకీ లేని వారెందరు? అన్న విషయాలపైనే వార్తలు వచ్చాయి. తాజాగా గురువారం ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చ మొదలైపోయింది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎంట్రీతో ఈ ప్రమాదంపై రచ్చ మొదలు కాగా... మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా క్విక్ రియాక్షన్ తో ఆ ఈ వ్యవహారం... రచ్చరచ్చగా మారిపోయింది.

గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన హర్షకుమార్... బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా హర్షకుమార్ చేసిన ఆరోపణల - నిజంగానే కలకలం రేపాయి. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని హర్షకుమార్ అన్నారు. ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారని... దీనికి సంబంధించి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మృతుల సంఖ్యను తక్కువగా చూపెట్టేందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు.

అంతటితో ఆగని హర్షకుమార్ సోమవారం మధ్యాహ్నానికే బోటు జాడ తెలిసిందని... అయితే లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో బోటును వెలికి తీయడం లేదని విమర్శించారు. సంచలనం కోసమో - పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని అన్నారు. బోటులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్ ఆరోపించారు. ఇందులో ఫారెస్ట్ - టూరిజం - ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని... అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదని... ఆ తర్వాత టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ - ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని అన్నారు. అవంతి లక్ష్యంగా హర్షకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి.

హర్షకుమార్ వ్యాఖ్యల్లో ఎంతమేర నిజముందో తెలియదు గానీ... హర్షకుమార్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విషయంలో అవంతి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా అవంతి చెప్పారు. ఆ రోజున బోటు అనుమతి కోసం ఏ అధికారినీ తాను ఒత్తిడి చేయలేదని, అది పచ్చి అబద్ధమని కూడా అవంతి పేర్కొన్నారు. హర్షకుమార్ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకు అయినా తాను సిద్ధమేనని, ఒకవేళ, నిరూపించలేకపోతే హర్షకుమార్ ఏ శిక్షకైనా సిద్ధమేనా? అని అవంతి ప్రశ్నించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన హర్షకుమార్ పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు. మొత్తంగా అటు హర్షకుమార్ ఆరోపణలు, ఇటు వాటికి కౌంటర్ గా అవంతి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రమాదంపై కొత్త రచ్చ మొదలైందనే చెప్పాలి.