Begin typing your search above and press return to search.

కొండా.. ఎవ‌రికి అండ‌!

By:  Tupaki Desk   |   23 July 2021 8:30 AM GMT
కొండా.. ఎవ‌రికి అండ‌!
X
పురాణాల్లో నార‌దుడు నాలుగు లోకాలు తిరుగుతూ.. అన్ని విష‌యాల‌నూ తెలుసుకుంటూ అక్క‌డి స‌మాచారాన్ని ఇక్క‌డికి ఇక్క‌డి స‌మాచారాన్ని అక్క‌డికి చేర‌వేస్తాడ‌నే సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కూడా అలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ‌ని విశ్లేష‌కులు అనుమానిస్తున్నారు. ప్ర‌స్తుతానికి తాను ఏ పార్టీకి చెందిన నాయ‌కుడినో స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని ఆయ‌న అన్ని పార్టీల‌తోనూ స‌ఖ్య‌త‌గానే మెలుగుతున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీతో త‌న రాజ‌కీయ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెల్ చేరిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో చేతు గుర్తుతోనే బ‌రిలో నిలిచారు. కానీ విజ‌యం సాధించ‌లేక‌పోయారు. ఏడాది త‌ర్వాత 2020లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆయ‌న బీజేపీలో చేర‌డం కోసం ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంతా అనుకున్నారు. ఆ దిశ‌గా ఆయ‌న అడుగులు కూడా క‌నిపించాయి. కానీ ఏమైందో ఏమో బీజేపీకి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ఏ రాజ‌కీయ పార్టీలోనూ స‌భ్యుడు కాడు.

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని క‌లిసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయ‌న తిరిగి కాంగ్రెస్‌లో చేర‌తార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ ఆ దిశ‌గా ఇంకా ఎలాంటి నిర్ణ‌యం చేయ‌లేదు. కానీ తాజాగా ఆయ‌న మ‌రోసారి ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌లిసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. హుజూరాబాద్‌లో పాద‌యాత్ర చేస్తున్న ఈటల ద‌గ్గ‌ర‌కు తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డితో క‌లిసి వెళ్లిన ఆయ‌న దాదాపు అర్ధ‌గంట సేపు కారులో మంత‌నాలు జ‌రిపారు. వాళ్లు ఏం మాట్లాడుకున్న‌ది ఎవ‌రికీ తెలీదు కానీ ఈట‌ల‌ను క‌లిసిన‌ విశ్వేశ్వ‌ర్‌రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించే చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

టీఆర్ఎస్ పార్టీని వ‌దిలిన త‌ర్వాత విశ్వేశ్వ‌ర్ రెడ్డిని ఈట‌ల క‌లిసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఈ ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంమైంది. దీంతో విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అస‌లు ఏ పార్టీ నాయ‌కుడో తెలీని గంద‌ర‌గోళ ప‌రిస్థితి త‌లెత్తింది. ఆయ‌న బీజేపీలో చేర‌తారా? లేదా తిరిగి కాంగ్రెస్ గూటికే వెళ్తారా? రేవంత్ రెడ్డితో స్నేహంగా ఉంటూ బీజేపీతో క‌లిసి ప‌నిచేస్తారా? కాంగ్రెస్‌లో చేరిన‌ప్ప‌టికీ హుజూరాబాద్‌లో ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తారా? ఇలా ఎన్నో స‌మాధానం లేని ప్ర‌శ్న‌లున్నాయి. వీట‌న్నింటికీ విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాత్ర‌మే జ‌వాబు చెప్ప‌గ‌ల‌రు.