Begin typing your search above and press return to search.

ఆమంచి నుంచి న‌న్ను కాపాడండి

By:  Tupaki Desk   |   23 July 2019 12:31 PM GMT
ఆమంచి నుంచి న‌న్ను కాపాడండి
X
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందు నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసిపిలోకి జంప్ చేసిన ఆమంచి ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభంజనం సృష్టించినా చీరాల‌లో మాత్రం టిడిపి సీనియర్ నేత కరణం బలరాంపై 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడిపోయారు. ఈ ఓటమిలో ఆమంచి వ్యక్తిగత ప్రవర్తణే ప్ర‌ధాన కారణం అన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికలు ముగిసినప్పటినుంచి ఆమంచి కుటుంబ సభ్యులతో పాటు ఆయ‌న అనుచ‌రులు స్థానికంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు బాధితులు రోడ్డెక్కారు.

కొద్ది రోజుల క్రిత‌మే ఆమంచి అన్న కుమారుడు ఆమంచి రాజేంద్ర ఓ హోంగార్డును బండ బూతులు తిడుతోన్న ఆడియో క్లిప్ వైర‌ల్ అయ్యింది. ఇక తాజాగా ఓ మాజీ ఎంపీటీసీ ఆమంచి అనుచ‌రుల నుంచి త‌న ఆస్తుల‌కు, త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ క‌లెక్ట‌రేట్ ముందు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఒంగోలులో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో చీరాల మండలం పుల్ల‌రిపాలెం తాజా మాజీ ఎంపిటిసి కోడూరి వెంకటేశ్వర్లు కలెక్టర్ భాస్క‌ర్‌ కు ఇదే అంశంపై విన‌తిప‌త్రం ఇవ్వ‌గా.. క‌లెక్ట‌ర్ ఆ ఆర్జీని ఎస్పీకి రిఫ‌ర్ చేశారు. అక్క‌డ నుంచి బయటకు వచ్చిన వెంటనే వెంకటేశ్వర్లు తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంట‌నే బాధితుడిని రిమ్స్‌ కు త‌ర‌లించారు.

తాను గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేశాన‌ని... చేప‌ల వేట క‌లిసి రాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం నుంచి నాలుగు ఎక‌రాల భూమిని పొంది వ్య‌వ‌సాయం చేసుకుంటున్నాన‌ని బాధితుడు చెప్పాడు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ప‌నిచేస్తూ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాన‌ని... ఆ పార్టీ ఎంపీటీసీగా కూడా ఉన్నానని.. తాజాగా ఆమంచి అనుచ‌రులు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న‌పై లేనిపోని అభాండాలు వేయ‌డంతో పాటు నీ భూమిని... ఇంటిని లాగేసుకుంటున్నామ‌ని... నువ్వు ఊళ్లో ఉండ‌డానికి వీళ్లేద‌ని హుకుం జారీ చేశార‌ని వెంక‌టేశ్వ‌ర్లు వాపోయాడు.

ఈ చ‌ర్య‌ల‌పై తాను వేట‌పాలెం పోలీస్‌ స్టేష‌న్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు సైతం ఆమంచి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌డంతో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్నారు. చివ‌ర‌కు ఆమంచి అనుచ‌రులు మూకుమ్మ‌డిగా త‌మ కుటుంబంపై చేసిన దాడిలో త‌న భార్య మంగ‌మ్మ‌ వేలు కూడా విరిగిపోయింద‌న్న బాధితుడు... ఎస్పీని క‌లిసి కూడా త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకున్న‌ట్టు చెప్పాడు. ఆమంచి అనుచ‌రుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించి త‌మ కుటుంబాన్ని ఆదుకోక‌పోతే తామంతా మూకుమ్మ‌డిగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తామ‌ని క‌లెక్ట‌ర్‌ కు వ‌చ్చిన విన‌తిప‌త్రంలో పేర్కొన్నాడు.