Begin typing your search above and press return to search.

వాజ్ పేయి ప‌రిస్థితి విష‌మం?

By:  Tupaki Desk   |   15 Aug 2018 7:01 PM GMT
వాజ్ పేయి ప‌రిస్థితి విష‌మం?
X
రాజ‌కీయ కురువృద్ధుడు - బీజేపీ అగ్రనేత - మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి (93) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువుడుతున్నాయి. గ‌త రెండు రోజులుగా వాజ్ పేయి వెంటిలేట‌ర్ (లైఫ్ స‌పోర్ట్) పై ఉన్నార‌ని - ఆయ‌న ప‌రిస్థితి కొద్దిగా విష‌మంగా ఉంద‌ని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ రోజు రాత్రి వాజ్ పేయి ఆరోగ్య ప‌రిస్థితిపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బుటిటెన్ విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఆ వార్త‌ల‌కు ఊత‌మిచ్చేలా....ప్ర‌ధాని మోదీ కొద్ది సేప‌టి క్రితం వాజ్ పేయిని ప‌రామ‌ర్శించేందుకు ఎయిమ్స్ కు చేరుకున్నారు. వాజ్ పేయి ఆరోగ్య ప‌రిస్థితిపై ఎయిమ్స్ వైద్యుల‌ను మోదీ స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు. మోదీతో పాటు ప‌లువురు బీజేపీ అగ్ర నేత‌లు ఎయిమ్స్ కు చేరుకుంటున్నారు. దీంతో, ఏ క్ష‌ణంలో ఏమ‌వుతుందోన‌ని బీజేపీ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

కిడ్నీ సంబంధిత‌ సమస్యలు - వృద్ధాప్య సమస్యలతో కొద్దికాలంగా వాజ్ పేయి బాధపడుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో, ఆయ‌న‌ను ఈ ఏడాది జూన్ 11న ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో వాజ్ పేయిని అడ్మిట్ చేశారు. ఈ క్ర‌మంలోనే వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి బుధవారం నాడు క్షీణించింద‌ని తెలుస్తోంది. అందువ‌ల్లే, మోదీ స‌హా పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ కు చేరుకుంటున్నట్టు క‌థ‌నాలు వెలువడుతున్నాయి. మోదీ క‌న్నా ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్‌ పేయిని పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని - అందిస్తున్న వైద్య సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మ‌రోవైపు, వాజ్‌ పేయి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గురువారంనాడు పార్టీ అధికారిక కార్యక్రమాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. వాజ్ పేయి ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త తెలుసుకొని బీజేపీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు.