Begin typing your search above and press return to search.

టీడీపీ వైపు పీసీసీ మాజీ అధ్యక్షుడు!?

By:  Tupaki Desk   |   28 Dec 2022 9:30 AM GMT
టీడీపీ వైపు పీసీసీ మాజీ అధ్యక్షుడు!?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని తలపోస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు అంచనాలకు మించి విజయవంతమైంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విధించిన అధిక ధరలకు నిరసనగా నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కూడా సక్సెస్‌ అయ్యింది. అలాగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా విజయవంతమైంది.

ఓవైపు నియోజకవర్గాల సమీక్షలతోపాటు ఆయా జిల్లాల్లో చంద్రబాబు సుడిగాడి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు జనవరి నెలాఖరు నుంచి నారా లోకేష్‌ భారీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తన తండ్రి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రకు పేరు కూడా ఖరారై పోయింది. యువగళం పేరుతో నారా లోకేష్‌ పాదయాత్ర చేయనున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి గట్టి అభ్యర్థులపైన చంద్రబాబు దృష్టిసారించారు. రాయలసీమలో వైసీపీ ప్రభావం అధికంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ రాయలసీమను కొన్ని సీట్లను మినహాయించి దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేసినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో రాయలసీమపై చంద్రబాబు ప్రధానంగా దృష్టిసారించారు.

రాయలసీమలోనూ ప్రధానంగా అనంతపురం జిల్లాపై చంద్రబాబు దృష్టి సారించారు. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్బావం నుంచి అనంతపురం జిల్లా టీడీపీకి పెట్టని కోటగా ఉంటోంది. అయితే వైసీపీ గాలి వీచిన 2019లో హిందూపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. 12 చోట్ల ఓడిపోయింది. అలాగే రెండు పార్లమెంటు స్థానాలను కూడా పోగొట్టుకుంది. 2014లో టీడీపీ 12 అసెంబ్లీ స్థానాలను, 2 ఎంపీ సీట్లను గెలుపొందడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తమకు గట్టి పట్టున్న అనంతపురంపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా వ్యవహరించిన సాకే శైలజానాథ్‌ ను పార్టీలో చేర్చుకుంటున్నారని తెలుస్తోంది. సాకే శైలజనాథ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాథ్‌ రెండుసార్లు 2004, 2009ల్లో శింగనమల నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు.

2014లో రాష్ట్ర విభజన జరిగాక చాలామంది కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీని వదిలిపోయారు. అయినా సరే సాకే మాత్రం పార్టీలోనే ఉన్నారు. ఈసారి మాత్రం ఆయన టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం శింగనమల ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఈమె గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బండారు శ్రావణిపై విజయం సా«ధించారు. ప్రస్తుతం శింగనమల టీడీపీ ఇన్‌చార్జిగా బండారు శ్రావణి ఉన్నారు.

2014లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గెలిచిన యామినీబాల, ఆమె తల్లి శమంతకమణి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారి లేని లోటును తీర్చుకోవడానికి సాకే శైలజానాథ్‌ అయితే సరిపోతారని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. బండారు శ్రావణితో పోలిస్తే శైలజానాథ్‌ గట్టి అభ్యర్థి అవుతారని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సాకేను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

మరోవైపు ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ జగన్‌ ఆ వర్గాలపై ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం ఎస్సీ నేతలను టీడీపీలో చేర్చుకోవడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సాకే శైలజానాథ్‌ చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.