Begin typing your search above and press return to search.

చిరుకు సాధ్యం కాలేదు కానీ.. ఆయ‌న నేత‌ల‌కు సాధ్య‌మైంది?

By:  Tupaki Desk   |   8 Jun 2019 11:47 AM GMT
చిరుకు సాధ్యం కాలేదు కానీ.. ఆయ‌న నేత‌ల‌కు సాధ్య‌మైంది?
X
కాలం చిత్ర‌మైంది. ఎత్తు ప‌ల్లాలు మామూలే. సుఖం వ‌చ్చిన‌ప్పుడు చెల‌రేగిపోవ‌టం.. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు దిగాలు ప‌డ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. క‌ష్టాలు.. స‌వాళ్లు ఎదురైన‌ప్పుడు ఎదురొడ్డి నిలిచిన వారికి ఏదో ఒక రోజు మంచి రోజు వ‌స్తుంద‌న్న విష‌యం తాజా జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రి ప‌ద‌వుల్ని సొంతం చేసుకున్న నేత‌ల్ని చూస్తే అర్థం కాక‌మాన‌దు.

పాతిక మంది మంత్రుల‌తో జ‌గ‌న్ మంత్రివ‌ర్గం కొలువు తీరింది. ఇందులో ముగ్గురు నాడు చిరంజీవి స్థాపించి.. త‌ర్వాతికాలంలో కాంగ్రెస్ లో క‌లిపివేసిన ప్ర‌జారాజ్యం పార్టీకి చెందిన వారు ఉండ‌టం విశేషం. జ‌గ‌న్‌ కేబినెట్ లో కాంగ్రెస్‌.. టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటు.. ప్ర‌జారాజ్యం ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకుంటే.. ప్ర‌జారాజ్యాన్ని పెట్టిన చిరంజీవి ఈ రోజురాజ‌కీయాల‌కు దూరంగా ఉంటే.. ఆయ‌న పార్టీతో కెరీర్ స్టార్ట్ చేసిన కొంద‌రునేత‌లు మాత్రం అందుకు భిన్నంగా రాష్ట్ర మంత్రులు కావ‌టం చూస్తే.. కాల మ‌హిమ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున 2009లో పోటీ చేసిన పార్టీ కేవ‌లం 18 స్థానాల్ని మాత్ర‌మే సొంతం చేసుకుంది. త‌ర్వాతి కాలంలో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీన‌మైంది. ఆ త‌ర్వాత కొంద‌రు టీడీపీలోకి వెళ్లిపోగా.. మ‌రికొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. నేడు కేబినెట్ లో మంత్రులుగా స్థానం సంప‌దించుకున్న నాటి జ‌న‌సేన నేత‌ల్లో అవంతి శ్రీ‌నివాస్‌.. వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు.. కుర‌సాల క‌న్న‌బాబు ఉన్నారు.

వీరు ముగ్గురు 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పీఆర్పీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించిన వారు. ఇక‌.. ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిన జ‌య‌రాం సైతం తాజా కేబినెట్ లో మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకోవ‌టం విశేషం. ఈ న‌లుగురు మంత్రుల ఒక‌ప్ప‌టి బాస్ రాజ‌కీయాల‌కుదూరంగా ఉండిపోతే.. వీరు మాత్రం ఈ రోజున ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషిస్తుండ‌టం విశేషం. ఇదంతా చూసిన‌ప్పుడు ఒక్క‌టి అనిపించ‌క‌మాన‌దు. చిరుకు సాధ్యం కాలేదు కానీ.. వారి శిష్యుల‌కు సాధ్య‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.