Begin typing your search above and press return to search.

కొత్త పార్టీ పేరు ప్రకటించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి !

By:  Tupaki Desk   |   3 Nov 2021 5:48 AM GMT
కొత్త పార్టీ పేరు ప్రకటించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి !
X
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ సింగ్ త‌న కొత్త పార్టీ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీని తెరపైకి తీసుకువచ్చారు. తాను స్థాపించబోయే పార్టీ పేరు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అని వెల్లడించారు. తన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. 79 ఏళ్ల అమరీందర్ సింగ్ ఇటీవలే పంజాబ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు ఆయన రాజీనామాకు కారణమయ్యాయి.

ఆ తర్వాత కూడా పార్టీ నుంచి సహకారం కొరవడడంతో ఇవాళ ఏఐసీసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌ పార్టీ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈరోజు నా రాజీనామా లేఖను పంపించారు. నేను రాజీనామా చేయడానికి గల కారణాలు అందులో వెల్లడించారు. అదే సమయంలో కొత్త పార్టీ పేరు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’గా నిర్ణయించాము. పార్టీ రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది. పార్టీ గుర్తును తర్వాత ప్రకటిస్తాం అని ఆ ట్వీట్ లో అమరీందర్ వెల్లడించారు.

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో కాంగ్రెస్ హైకమాండ్ బ‌ల‌వంతం మీద అమ‌రీంద‌ర్‌ సింగ్ సీఎం ప‌ద‌వి నుంచి వైదొలిగారు.అమ‌రీంద‌ర్ సింగ్ స్థానంలో హైక‌మాండ్ చ‌ర‌ణ్‌ జీత్ సింగ్ చ‌న్నిని కొత్త సీఎంగా నియ‌మించింది. అయితే కాంగ్రెస్ తనను అవమానించిందని అమరీందర్ సింగ్ ఆరోపించారు. అప్ప‌టి నుంచి అమ‌రీంద‌ర్ సింగ్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేన‌ట్లుగా ఉంటూ వ‌చ్చారు. పార్టీ త‌న‌ను అవ‌మానక‌ర రీతిలో ప‌ద‌వి నుంచి త‌ప్పించింద‌ని ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. అయితే ఊహాగానాలకు తెరదించుతూ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమరీందర్ పార్టీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక,ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన ఏడు పేజీల లేఖలో అమరీందర్ సింగ్…‘మీరు, మీ పిల్లలు ప్రవర్తించిన తీరు నిజంగా నన్ను తీవ్రంగా బాధించింది. మీ పిల్లలను నేను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నాను. వారి తండ్రిని నాకు 1954 నుంచి అంటే 67 ఏళ్ళ నుంచి తెలుసు. బడిలో చదువుకున్న రోజుల నుంచి తెలుసు. అందువల్ల నా పిల్లలను ప్రేమించినంతగా వారిని ప్రేమిస్తున్నాను అని వెల్లడించారు. కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై కూడా ఈ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సిద్ధూ పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను బహిరంగంగానే ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారని, పంజాబ్‌తోపాటు దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.