Begin typing your search above and press return to search.

తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీ షీటర్

By:  Tupaki Desk   |   6 Sep 2021 9:30 AM GMT
తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీ షీటర్
X
తీన్మార్ మల్లన్న కేసులో మాజీ రౌడీషీటర్ అంబర్ పేట శంకర్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. క్యూన్యూస్ చానెల్ వ్యవస్థాపకుడు అయిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇతడి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు గతనెల 27న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు-శర్మకు మధ్య సెటిల్ మెంట్ చేయడానికి అంబర్ పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టారు. దీంతో ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. అయితే తాను ఇందులో విఫలమయ్యానని శంకర్ పోలీూసులకు తెలిపాడు. ఈ మేరకు అతడి నుంచి చిలకలగూడ పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

-కేసు ఇదీ

లక్ష్మీకాంత శర్మ బాధితులు పేరుతో తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానెల్ లో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. అందులో లక్ష్మీకాంత శర్మ బాధితులమని చెబుతూ కొంతమంది తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని.. ఇవ్వకుంటే తప్పుడు వార్త కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించినట్టు లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మల్లన్నను అరెస్ట్ చేశారు.