Begin typing your search above and press return to search.

గ్రేటర్ కు స్పెషల్ ఆఫీసరే గతా ?

By:  Tupaki Desk   |   9 Dec 2020 3:30 PM GMT
గ్రేటర్ కు స్పెషల్ ఆఫీసరే గతా ?
X
మొన్ననే జరిగిన గ్రేటర్ మున్సిపాలిటికి మేయర్ ఎవరో ఇప్పట్లో తేలే అవకాశం కనిపించటం లేదు. అందుకనే స్పెషల్ ఆఫీసరే గతయ్యేట్లుంది. నిజానికి మొన్నటి ఫలితాల్లో ఏ పార్టీకి కూడా మేయర్ ను సొంతంగా ఎన్నుకునేంత సీన్ ఇవ్వలేదు ఓటర్లు. సింగిల్ లార్జుస్టు పార్టీగా 57 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచినా 37 కో ఆప్షన్ ఓట్లున్నా ఉపయోగం లేకపోయింది. 57 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ కే సింగిల్ గా మేయర్ పీఠం గెలుచుకునే అవకాశం లేకపోతే ఇక 44 డివిజన్లు గెలిచిన ఎంఐఎం, 48 డివిజన్లలో గెలిచిన బీజేపీకి మాత్రం ఎక్కడుంటుంది.

పోనీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్ సీటును గెలుచుకునే అవకాశం టీఆర్ఎస్ కు ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి కేసీయార్ రెడీగా లేరు. ఎందుకంటే మతతత్వ ఎంఐఎంతో చేతులు కలిపారని, తాము మొదటి నుండి చెబుతున్నట్లు ఆ రెండు పార్టీలు ఒకటే అని బీజేపీ ఎక్కడ గోల మొదలుపెడుతుందో అన్న టెన్షన్ కేసీయార్ ను వెంటాడుతోందట. అందుకనే ఎంఐఎం మద్దతు తీసుకోకూడదని అనుకున్నారట. ఎవరితోను కలవకూడదని అనుకున్నాక ఇక మేయర్ పోస్టు ఏ పార్టీకి దక్కనట్లే అనుకోవాలి.

అందుకనే గ్రేటర్ కు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని కేసీయార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఉంది. కాబట్టి గడువు అయ్యేంతవరకు ఇదే పాలకవర్గాన్ని కంటిన్యు చేయిస్తారని తర్వాత స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తారని అధికారపార్టీలో ప్రచారం జరుగుతోంది. అంటే కార్పొరేటర్లు మాత్రం ఉంటారు కానీ మేయర్ కుర్చీ మాత్రం ఖాళీగానే ఉంటుంది. గ్రేటర్ సమావేశాలు కూడా స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతనే కార్పొరేటర్లు నిర్వహించుకోవాల్సుంటుంది.

గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్లను పంచుకున్న టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం పార్టీల్లో ఏ పార్టీ కూడా మరోపార్టీతో కలిసే అవకాశం లేదు. కాబట్టి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఎంతకాలం ఉంటే అంతకాలం స్పెషల్ ఆఫీసర్ పాలనే శరణ్యమని అర్ధమైపోయింది. కేవలం బీజేపీ దెబ్బకే కేసీయార్ ఎంఐఎంతో కలవకుండా దూరంగా ఉంటున్నారు. నిజానికి ఇటువంటి పరిస్దితి గతంలో ఎప్పుడు తలెత్తుండదు. మొత్తానికి ఓటర్లు మాత్రం మంచి తెలివైన తీర్పే ఇచ్చారని అనుకోవాలి.