Begin typing your search above and press return to search.

కీలకమైన జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

By:  Tupaki Desk   |   4 Jan 2023 7:15 AM GMT
కీలకమైన జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
X
ఆంధ్రప్రదేశ్‌ లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ సీట్లు 19 ఉన్నాయి. 'తూర్పు' గాలి ఏ పార్టీ వైపు ఉంటే రాష్ట్రంలో అధికారం కూడా అటే ఉంటుందని సామెత. అలాంటి కీలకమైన జిల్లాలో నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి టీడీపీ నేత రాజీనామా కలకలం సృష్టిస్తోంది. రాజమహేంద్రవరం ఆనుకుని ఉన్న కీలక నియోజకవర్గం రాజా నగరం. దీనికి ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న పెందుర్తి వెంకటేష్‌ రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని ఆయన లేఖ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిపినట్టు చెబుతున్నారు. పెందుర్తి వెంకటేష్‌ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో ఓడిపోయారు.

కాగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో రాజానగరంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పెందుర్తి వెంకటేష్‌ పనితీరు బాగోలేదని.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై మనస్తాపానికి గురయ్యే పెందుర్తి వెంకటేష్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.

మరోవైపు తాను టీడీపీకి రాజీనామా చేయలేదని.. కేవలం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి మాత్రమే రాజీనామా చేశానని పెందుర్తి వెంకటేష్‌ పేర్కొన్నారు. గతంలోనే నియోజకవర్గానికి కొత్త ఇన్‌చార్జిని నియమించుకోవాలని చంద్రబాబుకు చెప్పానని పెందుర్తి గుర్తు చేశారు. అయితే పార్టీ ఇప్పటివరకు దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో తానే ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేది టీడీపీయేనని స్పష్టం చేశారు. టీడీపీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు.

కాగా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. పెందుర్తి వెంకటేష్‌ ను బుజ్జగించినట్టు తెలిసింది. తొందరపడొద్దని.. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్టు సమాచారం. తాను అన్ని విషయాలు చంద్రబాబుతో చర్చిస్తానని.. అప్పటివరకు ఓపిక పట్టాలని వెంకటేష్‌ ను కోరినట్టు చెబుతున్నారు.

కమ్మ సామాజికవర్గానికే చెందిన పెందుర్తి వెంకటేష్‌ రాజీనామా వ్యవహారం టీడీపీలో చర్చకు దారితీసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.