Begin typing your search above and press return to search.

2024లో ఏపీకి కాపు సీఎం.. ఈ స్టేట్మెంట్ ఇచ్చిందెవరంటే....?

By:  Tupaki Desk   |   11 Jan 2023 1:30 PM GMT
2024లో ఏపీకి కాపు సీఎం.. ఈ స్టేట్మెంట్ ఇచ్చిందెవరంటే....?
X
ఏపీకి 2024లో వచ్చేది కాపు సీఎం. నిజానికి ఆ మాట వింటేనే బలమైన సామాజికవర్గంలో ఆనందం కట్టలు తెంచుకుంటుంది. ఎందుకంటే అది వారి చిరకాల కోరిక. కాపులకు అధికార వాటా దక్కాలని, రాజ్యాధికారం సంపాదించాలని. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కులంలో గండర గండ నాయకులు విశ్వ ప్రయత్నమే చేస్తూ వచ్చారు. అది మాత్రం కుదరడంలేదు.

ఏపీ అంతా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వంగవీటి రంగా హత్య కావించబడ్డారు. ఆయన బతికి ఉంటే ఏనాడో ఆ కోరిక కాపులకు తీరడమే కాదు, ఏపీ రాజకీయాల్లో కాపులు ఎన్నో సార్లు సీఎం అవుతూ వచ్చేవారు. ఇక ఆయన తరువాత అంతే వాడిగా వేడిగా పోరాటం చేసిన వారు ముద్రగడ పద్మనాభం. ఆయన కమిట్మెంట్ కి ఎవరైనా దాసోహం అనాల్సిందే.

కానీ ఆయన సైతం కాపులను ఏకతాటి మీదకు తెచ్చినా అనుకున్నది సాధించలేకపోయారు. ఈ మధ్యలో ప్రజారాజ్యం తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కూడా తనదైన ప్రయత్నం చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇపుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో ఏదైనా చేస్తారు అనుకుంటే ఆయన పొత్తుల బాట పడుతున్నారు.

అయితే ఈ పొత్తుల ఎత్తులతోనే ఏదో నాటికి కాపులను సీఎం గా చూస్తామని జనసేన నేతలు విశ్వాసంతో ఉన్నారు. కానీ ఇపుడు ఏపీలో ఏమీ కాని ఉనికి పోరాటం కూడా చేయలేని కాంగ్రెస్ నుంచి ఒక చిత్రమైన స్టేట్మెంట్ వచ్చింది. ఏపీలో 2024 ఎన్నికల్లో కాపులే సీఎం అవుతారు అని. పైగా మరో మాట కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వందకు పైగా సీట్లు కాంగ్రెస్ కి వస్తాయని.

నిజంగా అది జరుగుతుందా. కాంగ్రెస్ కి ఆ సీట్లు వస్తే కాపుల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వాదన. కానీ ఏపీలో 2014, 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ 2024లో ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.

అయితే చింతా మోహన్ ధీమా వేరుగా ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశంలో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది కాబట్టి ఏపీలో కూడా ఆ ప్రభావం పడుతుందని అందువల్ల కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని. రాహుల్ జోడో యాత్ర దేశంలో పెను ప్రభావం చూపిస్తుంది అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చెబుతున్నారు.

ఇక ఏపీలో కూడా 20కి తగ్గకుండా ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన అంటున్నారు. నిజంగా ఇదే నిజమైతే మాత్రం ప్రపంచంలో ఎనిమిదో వింత అనే చెప్పాలి. చింతా మోహన్ మరో మాట కూడా అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి సీఎం అయ్యే చాన్స్ లేనే లేదని. అందువల్ల కాపులకే సీఎం పదవి దక్కుతుందని. ఆయన మాటలను బట్టి చూస్తే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాపు నేతను తామే ముఖ్యమంత్రిగా చేస్తామని అన్న మాట. చూద్దాం, ఈ కాంగ్రెస్ నేత మాటలు ఆయన ఆత్మ విశ్వాసానికి సంకేతంగానే చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.