Begin typing your search above and press return to search.

మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ ఇక‌లేరు!

By:  Tupaki Desk   |   10 Oct 2022 5:20 AM GMT
మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ ఇక‌లేరు!
X
ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ తీవ్ర అనారోగ్యంతో అక్టోబ‌ర్ 10 ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొన్నిరోజులుగా ఆయ‌న హ‌రియాణాలోని గురుగ్రామ్‌లో ఉన్న వేదాంత ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వ‌యోభారంతో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న మ‌ర‌ణించార‌ని వైద్యులు తెలిపారు. శ్వాస‌కోస స‌మ‌స్య‌లు, యూరిన్‌, కిడ్నీ ఇన్‌ఫెక్ష‌న్లు ఆయ‌న మృతికి కార‌ణ‌మ‌య్యాయ‌ని వివ‌రించారు.

గ‌తంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒక‌టైన ఉత్త‌ర‌ప్రదేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ములాయం సింగ్ యాద‌వ్ ప‌నిచేశారు. అంతేకాకుండా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రిగానూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప‌లు ప‌ర్యాయాలు యూపీలోని ఆజంగ‌ఢ్‌, సంభాల్‌, క‌నౌజ్ ల నుంచి ఎంపీగానూ గెలుపొందారు.

2012 ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌న విజయం సాధించాక ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌కుండా త‌న కుమారుడు అఖిలేష్ యాద‌వ్‌ను ముఖ్య‌మంత్రిని చేశారు. దీంతో అఖిలేష్ 2017 వ‌ర‌కు ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. కాగా మొత్తం మూడుసార్లు ములాయం సింగ్ యాద‌వ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. జీవితాంతం బీజేపీని వ్య‌తిరేకిస్తూనే వ‌చ్చారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దేశంలోనే అత్య‌ధికంగా 80 లోక్‌స‌భ సీట్లు ఉండ‌టంతో దేశ ప్ర‌ధాన‌మంత్రి అవ్వాల‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఆ ఆశ‌లు నెర‌వేర‌కుండానే ఆయ‌న క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు.

ములాయం సింగ్ రెండు వివాహాలు చేసుకున్నారు. ఆయ‌న‌కు మొద‌టి భార్య ద్వారా ప్ర‌స్తుత స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్‌, రెండో భార్య ద్వారా ప్ర‌తీక్ యాద‌వ్ జ‌న్మించారు. ప్ర‌తీక్ యాద‌వ్ వ్యాపారాల్లో ఉన్నారు.

దేశానికి స్వాతంత్య్రం రాక‌ముందు 1939లో ములాయం సింగ్ యాద‌వ్ జ‌న్మించారు. కుస్తీ పోటీల్లో ఆయ‌న‌కు మంచి ప్రావీణ్యం ఉంది. ఎటావాలో జన్మించిన ములాయం సింగ్ యాద‌వ్ ఆగ్రా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ చేశారు.

ములాయం సింగ్ యాద‌వ్ కుటుంబం మొత్తం రాజ‌కీయాల్లోనే ఉంది. ఆయ‌న సోద‌రుడు శివ్ పాల్ సింగ్ యాద‌వ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌నిచేశారు. మ‌రో క‌జిన్ రాంగోపాల్ యాద‌వ్ కూడా ఎంపీగా చేశారు. ఇత‌ర బందువుల‌ను సైతం పెద్ద సంఖ్య‌లో రాజ‌కీయాల్లోకి తెచ్చారు.

సోష‌లిస్టు నేత రాంమ‌నోహ‌ర్ లోహియా సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితుడై ములాయం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో ఇందిరాగాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అరెస్టు అయిన వారిలో ములాయం ఒక‌రు.

1989లో తొలిసారి ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అయిన ములాయం రెండోసారి 1993లో మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. 2003లో మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వ హ‌యాంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.