Begin typing your search above and press return to search.

వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మహిళా మంత్రి రాజీనామా

By:  Tupaki Desk   |   5 Nov 2022 6:30 AM GMT
వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మహిళా మంత్రి రాజీనామా
X
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ జిల్లా వైసీపీలో కలకలం రేగింది. ఆమె వైసీపీకి సైతం రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి మొదటిసారి 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ వైసీపీ ఏర్పాటు చేశాక 2011లో వైసీపీలో చేరారు.

ఆయనకు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికలో ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2019లో వైసీపీ తరఫున సుచరిత విజయం సాధించారు.

మేకతోటి సుచరిత .. వైఎస్‌ జగన్‌ తొలి మంత్రివర్గ విస్తరణలో కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. అయితే జగన్‌ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవి పోయింది.

మొదటి కేబినెట్‌ విస్తరణలో ఉన్న దళిత నేతలందరినీ కొనసాగించి తనను మాత్రమే తొలగించడంపై అప్పట్లో ఆమె కినుక వహించారు. దీంతో సుచరితను వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు.

అయితే ఆమె ఆ పదవిలో అసంతృప్తిగానే ఉన్నారని టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకుండా పక్కన కూడా పెట్టొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని సుచరిత తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.