Begin typing your search above and press return to search.

'ఎర' ఎమ్మెల్యేలు నలుగురు.. ఇన్ని రోజులుగా ప్రగతిభవన్ లోనే?

By:  Tupaki Desk   |   29 Oct 2022 6:38 AM GMT
ఎర ఎమ్మెల్యేలు  నలుగురు.. ఇన్ని రోజులుగా ప్రగతిభవన్ లోనే?
X
సంచలన రాజకీయ పరిణామం ఒకటి చోటు చేసుకున్నప్పుడు.. దాని వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగినట్లుగా అనుమానిస్తున్నప్పుడు.. అందులోని వారందరిని ప్రశ్నించటం.. వారి నుంచి సమాచారం సేకరించటం లాంటివి సహజంగా జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా కొందరి విషయంలో యమా సీరియస్ గా.. మరికొందరు విషయంలో అసలు పట్టనట్లుగా ఉండటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తెలంగాణ అధికార పక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని బీజేపీకి చెందిన మధ్యవర్తులు సంప్రదింపులు జరపటం.. దాదాపు రూ.250 కోట్లకు పైనే డీల్ దిశగా చర్చలు జరపటం.. అమ్ముడుబోయేందుకు రెఢీ అయినట్లుగా నటించి.. చివర్లో పోలీసులకు సమాచారం ఇవ్వటం ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లో బీజేపీ తరఫు మధ్యవర్తులుగా అభియోగం ఎదుర్కొన్న ముగ్గురు ముఖ్యుల్ని పోలీసులు అరెస్టు చేయటం.. వారిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టటం.. వారిని రిమాండ్ కు ఇవ్వాలన్న అభ్యర్థనను కొట్టేయటం ఆసక్తికర పరిణామంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఫామ్ హౌస్ లో బీజేపీ తరఫు మధ్యవర్తుల్ని అడ్డంగా బుక్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమను ప్రలోభానికి గురి చేస్తున్నట్లుగా పోలీసు అధికారులకు కంప్లైంట్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సిబ్బందితో ఫామ్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. ఎరకు తెర తీసిన మధ్యవర్తుల్ని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టార్గెట్ చేసినట్లుగా చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్ని ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతిభవన్ కు తరలించటం తెలిసిందే.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కోసం ప్రగతిభవన్ కు వెళ్లిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం అర్థరాత్రి వరకు కూడా బయటకు రాలేదు. రాజకీయ వర్గాల్లో ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారిన ఉదంతానికి సంబంధించి కీలకమైన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. టార్గెట్ అయిన ఎమ్మెల్యేల్ని ప్రగతిభవన్ కు పంపటం తెలిసిందే.

ప్రగతిభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు గడిచిన మూడు రోజులుగా అక్కడే ఉండటంపై పలువురు విస్మయానికి గురవుతున్నారు. ఒక ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలు నలుగురిని తన అధికార నివాసంలో అట్టి పెట్టుకోవటం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పని పరిస్థితి. ప్రగతిభవన్ లోనే ఉన్న నలుగురు ఎర ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రెస్ మీట్ పెడతారన్న ప్రచారం జరిగినప్పటికి.. అలాంటిదేమీ జరగలేదు.

ఇదిలా ఉంటే.. నలుగురు ఎమ్మెల్యేల్ని ముఖ్యమంత్రి అధికార నివాసంలో రోజుల తరబడి ఎందుకు ఉంచాల్సి వచ్చింది? దాని వెనుకున్న అసలు విషయం ఏమిటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ మంత్రులు.. ఎమ్మెల్యేలు సైతం సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి. ఇక.. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలా రాజకీయ సంచలనానికి కారణమైన నలుగురు ఎమ్మెల్యేల్ని ముఖ్యమంత్రి తన నివాసంలో రోజుల తరబడి ఎలా ఉంచుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. దీనికి తెలంగాణ అధికారపక్ష నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.