Begin typing your search above and press return to search.

నీతి ఆయోగ్ కు న‌లుగురు సీఎంలు డుమ్మా?

By:  Tupaki Desk   |   16 Jun 2019 7:36 AM GMT
నీతి ఆయోగ్ కు న‌లుగురు సీఎంలు డుమ్మా?
X
అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఒక చోట‌కు చేర‌టం.. ప్ర‌ధాన‌మంత్రితో కూర్చొని రాష్ట్రాల అంశాల్ని ప్ర‌స్తావించ‌టం.. త‌మ అవ‌స‌రాల్ని చ‌ర్చించ‌టం లాంటి అవ‌కాశాలు ఉండే కీల‌క వేదిక‌కు హాజ‌రు కాకుండా ఎవ‌రైనా డుమ్మా కొడ‌తారా? అంటే.. లేద‌నే చెబుతారు ఎవ‌రైనా. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ముఖ్య‌మంత్రులు దేశ వ్యాప్తంగా న‌లుగురు ఉంటే.. అందులో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఒక ముఖ్య‌మంత్రి ఒకరున్నారు.

నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి స‌మావేశానికి నాలుగు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు రాలేదు. తెలంగాణ‌.. ప‌శ్చిమ‌బెంగాల్.. పంజాబ్‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు గైర్హాజ‌రు అయ్యారు. న‌లుగురిలో ముగ్గురిది రాజ‌కీయ కార‌ణాల వ‌ల్లే హాజ‌రు కాక‌పోవ‌టం క‌నిపిస్తుంది.

నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళ్లాలంటూ హ‌డావుడి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. అందుకు త‌గ్గ‌ట్లే అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టించి డాక్యుమెంట్స్ సిద్ధం చేయించారు. తీరా.. ఆయ‌న వెళ్ల‌లేదు. ఎందుక‌న్న కార‌ణం చెప్ప‌లేదు. కాళేశ్వ‌రం ఓపెనింగ్ కోస‌మ‌ని చెప్పిన మాట అత‌క‌లేదు. ఇదిలా ఉంటే.. అస‌లు కార‌ణం ఏమంటే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఓపెనింగ్ కోసం మోడీ మాస్టారిని పిలుద్దామ‌ని డిసైడ్ అయ్యారు. అయితే.. ఆయ‌న్ను క‌లిసేందుకు టైం ఇవ్వ‌క‌పోవ‌టంతో ఈగోకు దెబ్బ త‌గిలిన కేసీఆర్‌.. అస‌లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌నే ర‌ద్దు చేసుకున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు మ‌న‌సులో ఉన్న మోడీ.. ఆ కార‌ణంగానే అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌ని చెబుతారు. ఇదిలా ఉంటే.. ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గురించి తెలిసిందే. నీతి ఆయోగ్ కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నాలు లేద‌ని ఆమె చెప్పినా.. రాజ‌కీయంగా ప్ర‌స్తుతం మోడీ వ‌ర్సెస్ దీదీల మ‌ధ్య న‌డుస్తున్న ర‌చ్చ తెలిసిందే. మోడీ నాయక‌త్వంలో ఉన్న స‌ద‌స్సులో పాల్గొన‌టం ఇష్టం లేక.. ఆమె వెళ్ల‌లేద‌ని చెబుతారు. దీనికి ఆమె నీతి ఆయోగ్ శుద్ద దండ‌గ అంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం మ‌రో అంశం.

ఈ స‌ద‌స్సుకు హాజ‌రు కాని మ‌రో ముఖ్య‌మంత్రి పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయ‌న‌కు మోడీల‌కు మ‌ధ్య వైరం ఉన్న‌దే. ఆ కార‌ణంతోనే ఆయ‌న వెళ్ల‌లేదు. ఇక‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టంతో ఆయ‌న హాజ‌రు కావ‌టం సాధ్యం కాలేదు. ఒక‌రు మిన‌హా మిగిలిన ముగ్గురు రాజ‌కీయ కార‌ణాల‌తోనే నీతి ఆయోగ్ స‌మావేశానికి వెళ్లిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.