Begin typing your search above and press return to search.

పర్సులో క్యాష్ చెక్ చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   24 Dec 2015 10:04 AM GMT
పర్సులో క్యాష్ చెక్ చేసుకున్నారా?
X
ఏటీఎంలు రంగప్రవేశం చేసిన తర్వాత జేబులో క్యాష్ పెట్టుకోవటం బాగా తగ్గిపోయింది. అకౌంట్లో డబ్బులు ఉంచుకోవటం.. జేబులో డబ్బులు పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే క్యాష్ కోసం ఏటీఎం సెంటర్లకు వెళ్లటం అలవాటైంది. ఆ అలవాటే ఇప్పుడు పొరపాటుగా మారి.. ఇబ్బందులకు గురి చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. వరుసగా వచ్చిన సెలవులతో బ్యాంకులు పని చేయకపోవటం.. దీంతో.. ఏటీఎంలలో డబ్బు నింపే అవకాశం లేని పరిస్థితి.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలురాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. క్యాష్ డ్రా చేసుకోవటానికి ఏటీఎం సెంటర్లకు వెళుతుంటే.. అక్కడ చాంతాడంత క్యూ దర్శనమిస్తోంది. కొన్ని ఏటీఎంలలో డబ్బు ఇప్పటికే అయిపోతే.. మరికొన్ని ఏటీఎంలలో శుక్రవారం నాటికి నిండుకునే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బులు అయిపోయిన వెంటనే.. లోడ్ చేసే అవకాశం వరుసగా వచ్చిన సెలవుల కారణంగా లేని పరిస్థితి.

గురువారం మిలాడి నబీ.. శుక్రవారం క్రిస్మస్.. శనివారం.. ఆదివారాలు సెలవులతో బ్యాంకులు పని చేసే పరిస్థితి దేశంలోని చాలా రాష్ట్రాల్లో లేదు. దీంతో.. బుధవారం లోడ్ చేసిన నగదే.. సోమవారం బ్యాంకులు ఓపెన్ చేసి.. తిరిగి లోడ్ చేసే వరకూ నడవాలి. అంటే.. నాలుగు రోజులు వరుసగా క్యాష్ లోడ్ చేసే అవకాశం లేని పరిస్థితుల్లో.. జేబులో క్యాష్ అయిపోయిన వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. జేబులోని పర్సును చెక్ చేసుకొని.. ముంచుకొచ్చే ఇబ్బందిని గుర్తించి.. వెంటనే కాసిన్ని డబ్బుల్ని డ్రా చేసుకోవటం అత్యవసరం. సో.. ఆలస్యం చేయకుండా డ్రా చేసుకొని కొంత క్యాష్ ను జేబులో ఉంచుకోవటం మర్చిపోకండి.