Begin typing your search above and press return to search.

ఈ రోజు కానీ బ్యాంకు వెళ్లటం మిస్ అయ్యారా..

By:  Tupaki Desk   |   25 Nov 2016 5:37 AM GMT
ఈ రోజు కానీ బ్యాంకు వెళ్లటం మిస్ అయ్యారా..
X
ఏటీఎంలు రంగ ప్రవేశం జరిగాక.. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి బ్యాంకులకు వెళ్లే రోజులు పోయి చాలానే ఏళ్లు అయ్యాయి. వర్తమానంలోనే కాదు.. భవిష్యత్తులో విత్ డ్రా కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండనే ఉండదని అనుకునే వారు. మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. మొన్నటి వరకూ బ్యాంకు ముఖం చూడని వారు.. ప్రతి పనిని అయితే ఆన్ లైన్ లేదంటే ఏటీఎం సెంటర్లలో పని పూర్తి చేసే వారంతా ఇప్పుడు క్యూ వరుసల్లో నిలుచునే పరిస్థితి.

నవంబర్ 8 రాత్రి 8 గంటల తర్వాత ప్రధాని మోడీ చేసిన ప్రకటన తర్వాత పరిస్థితి మొత్తంగా మారిపోయింది. ఇప్పటివరకూ లేని ఎన్నో కొత్త అలవాట్లను దేశ ప్రజలు చేసుకోవాల్సి వస్తోంది. చేతిలో నాలుగు రూపాయిలు ఉన్నప్పుడేబ్యాంకుకు వెళ్లటం.. క్యూలైన్లో నిలుచోవటం.. ఏటీఎం సెంటర్ల దగ్గర డబ్బులు ఎప్పుడు ఫీడ్ చేస్తారన్న సమాచారాన్ని తెలుసుకొని.. ఆ టైంకి ఏటీఎం సెంటర్ కు చేరుకోవటం లాంటి కొత్త కొత్త అలవాట్లు వచ్చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీ చేతిలో డబ్బులు పెద్దగా లేకుంటే మాత్రం మీరు మరింకేమీ ఆలోచించకుండా ఈ రోజు బ్యాంకుకి వెళ్లాల్సిందే.

ఈ రోజు కానీ బ్యాంకుకు వెళ్లటం మిస్ అయ్యారా? పెద్ద చిక్కులో పడినట్లే. ఎందుకంటారా? ఏటీఎం సెంటర్ల వద్ద గంటల కొద్దీ క్యూలో నిలచుంటే విత్ డ్రా చేసుకునే మొత్తం చాలా స్వల్పం మాత్రం. నెలాఖరు రోజుల్లో నాలుగు రూపాయిలు చేతిలో ఉండాలంటే బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవాల్సిందే. అయితే.. ఈ రోజు కానీ బ్యాంకు వెళ్లటం మిస్ అయితే.. రానున్న మూడు రోజులు బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే.. శనివారం నుంచి సోమవారం వరకూ బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి.

నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు రేపు పని చేయవు. తర్వాత ఆదివారం సంగతి తెలిసిందే. ఇక.. పద్దెనిమిది విపక్షాలు మూకుమ్మడిగా తీసుకున్న భారత్ బంద్ నేపథ్యంలో సోమవారం బ్యాంకులు పని చేస్తాయా? లేదా? అన్నది సందేహమే. ఈ నేపథ్యంలో బ్యాంకు వెళ్లి విత్ డ్రా చేసుకోవాల్సిన పని ఉంటే.. మిగిలిన పనుల్ని పక్కన పెట్టేసి.. ముందు బ్యాంకు పని చూసుకోవటానికి మించిన ఉత్తమం మరొకటి ఉండదు. సో.. బ్యాంకు వెళ్లాల్సిన పని ఉన్న వారు.. ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లో మిస్ కానే కావొద్దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/