Begin typing your search above and press return to search.

స్మృతి కారును ఫాలో అయినోళ్ల‌కు బెయిల్‌

By:  Tupaki Desk   |   2 April 2017 10:31 AM GMT
స్మృతి కారును ఫాలో అయినోళ్ల‌కు బెయిల్‌
X
చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లాల్సిందే. కానీ.. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కొన్ని మార్పులు అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని గుర్తించాల్సిన అవ‌స‌రం లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పెళ్లికి.. చావుకు ఒకే మంత్రం ఏ విధంగా స‌రిపోదో.. కొన్ని తీవ్ర‌మైన విష‌యాల మీద చ‌ట్టం మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. పూటుగా తాగేసి.. ఇష్టారాజ్యంగా రోడ్ల మీద చెల‌రేగిపోయే వారికి క‌ఠిన శిక్ష‌లు ప‌డే దిశ‌గా చ‌ట్టాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

రోడ్ల‌పై మృత్యుశ‌క‌టాలుగా మార్చేసి.. ఒళ్లు పై తెలీకుండా కార్ల‌ను తోలేసే వారికి.. ఇట్టే బెయిల్ ఇచ్చేసే ధోర‌ణిపై చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. నిన్న‌టికి నిన్న ఢిల్లీ రోడ్ల మీద వెళుతున్న మంత్రి స్మృతి ఇరానీ కారును.. ఫుల్ల‌గా తాగేసిన పోకిరీలు ఇష్టారాజ్యంగా న‌డిపేయ‌ట‌మే కాదు.. ఆమె కారును ఫాలో అయి వేధించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి కేంద్ర‌మంత్రి చాణ‌క్య‌పురి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

దీంతో.. అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించిన న‌లుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ ను న‌మోదు చేసి.. ఆదివారం ఉద‌యం న్యాయ‌స్థానానికి హాజ‌రు ప‌రిచారు. ఆనంద్ శ‌ర్మ‌.. అవినాష్‌.. శిత‌న్షు.. కునాల్ న‌లుగురు యువ‌కులు బ‌ర్త్ డే పార్టీకి వెళ్లి ఫుల్ గా తాగేసి తిరిగి వ‌స్తున్న వేళ‌.. మంత్రి కారును ఫాలో అయి ఆమెను ఇబ్బంది పెట్టారు. పోలీసులు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో వారు తాగిన‌ట్లుగా నిరూప‌ణ అయ్యింది. మ‌రింత త‌ప్పు చేసిన వారికి కోర్టు బెయిల్ ల‌భించిన వైనం చూసిన‌ప్పుడు.. చ‌ట్టాలు ఇంత బ‌ల‌హీనంగా ఉన్నాయా? అనిపించ‌క మాన‌దు. కేంద్ర‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తినే ఇబ్బంది పెట్టిన వారు గంట‌ల వ్య‌వ‌ధిలో బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు.. సామాన్య మ‌హిళ‌ల విష‌యంలో ఇలాంటిదే జ‌రిగి ఉంటే.. ఆమెకు జ‌రిగే న్యాయం ఎంత‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/