Begin typing your search above and press return to search.

వీసా మోసంలో న‌లుగురు భార‌తీయులు అరెస్ట్‌

By:  Tupaki Desk   |   3 July 2019 7:16 AM GMT
వీసా మోసంలో న‌లుగురు భార‌తీయులు అరెస్ట్‌
X
అమెరికాలో మ‌నోళ్లు న‌లుగురు అరెస్ట్ అయ్యారు. ఈ న‌లుగురు భార‌తీయుల్లో తెలుగోళ్లు ఇద్ద‌రు ఉన్నారు. అమెరికాకు వెళ్లేందుకు సాయం చేసే హెచ్ 1బీ వీసాల్ని మోస‌పూరితంగా ఉప‌యోగించార‌న్న ఆరోప‌ణ‌లపైన వీరిని అరెస్ట్ చేశారు. అమెరికాలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి.. భార‌త్ నుంచి అక్ర‌మంగా అమెరికాకు తీసుకురావ‌టం.. అందుకు అవ‌స‌ర‌మైన వీసాల‌కు సంబంధించి దొంగ డాక్యుమెంట్ల‌ను సృష్టించి అక్ర‌మ ప‌ద్ద‌తిలో తీసుకొస్తున్న ఆరోప‌ణ‌ను వీరిపై వేశారు.

న్యూజెర్సీలో ఉంటున్న విజ‌య్ మానె.. వెంక‌ట‌ర‌త్నం మ‌న్నం..సతీశ్ వేమూరి.. ఫెర్డినాండో శిల్వాల‌పై వీసా నేరాల‌కు సంబంధించిన అభియోగాల్ని న‌మోదు చేశారు. ఈ న‌లుగురు న్యూజెర్సీ ప్రాంతంలో ప్రొక్యూర్ ప్రొఫెష‌న‌ల్స్.. క్రిప్టో ఐటీ సొల్యూష‌న్స్.. క్లెయింట్ - ఏ పేరుతో కంపెనీలు న‌డుపుతున్నారు.

అమెరికాలో ఉద్యోగానికి అవ‌స‌ర‌మైన హెచ్ 1 బీ వీసాల్ని ఇచ్చేవారు. ఇందుకోసం త‌ప్పుడు ప‌త్రాల్ని అంద‌జేసేవారు. దీంతో.. ఎలాంటి నైపుణ్యం లేకున్నా.. వీరిచ్చే త‌ప్పుడు ప‌త్రాల‌తో హెచ్ 1 బీ వీసాల మీద మోస‌పూరితంగా అమెరికాలో అడుగుపెట్ట‌టానికి వీలు ఉంటుంది.

వీరికి సంబంధించి వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై విచార‌ణ జ‌రిపి వీరినిఅదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం 2.5ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్ల పూచీక‌త్తుపై వారిని విడుద‌ల చేసిన‌ట్లుగా తెలుస్తోంది. వీసాల విష‌యంలో ట్రంప్ స‌ర్కారు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. త‌ప్పుడు ప‌త్రాల‌పై అక్ర‌మ ప‌ద్ద‌తిలో వీసాలు పొందిన నేరంలో మ‌నోళ్లను అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచ‌ల‌నంగా మారింది.