Begin typing your search above and press return to search.

మోహన్ బాబు ఇంట్లో నాలుగు పార్టీలు?

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 AM GMT
మోహన్ బాబు ఇంట్లో నాలుగు పార్టీలు?
X
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఏ రాజకీయ పార్టీ అంటే ఠక్కున జవాబు చెప్పేందుకు ఎవరైనా బుర్ర తడుముకోవాల్సిందే. ఆయన ఫలానా పార్టీ అని చెప్పడానికి కూడా వీలు లేనే లేదు. ఆయన తాను రాజకీయాల్లో లేను అని మోహన్ బాబు ఒక్కోసారి అంటారు. కానీ ఆయన అన్ని పార్టీలు చుట్టేసారు అని జనాభిప్రాయంగా చెబుతూ ఉంటారు. మోహన్ బాబు విషయమే తీసుకుంటే ఆయన ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని ప్రకటించినపుడు సినీ రంగం నుంచి మొట్టమొదటిగా వెళ్ళి చేరిన నటుడు. ఆ విధంగా ఆయన టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పాలి.

అలా మోహన్ బాబు చంద్రబాబు టైం లో కూడా టీడీపీలో కొన్నాళ్ళు కొనసాగి ఆ తరువాత బీజేపీకి మద్దతుగా బయటకు వచ్చారు. మళ్లీ ఆయన వైసీపీకి మద్దతు అంటూ 2019 ఎన్నికల్లో జగన్ తో కండువా కప్పించుకున్నారు. ఇపుడు ఆయన చంద్రబాబుతో కలసి ఫోటో తీయించుకుని ఫోకస్ అయ్యారు. ఇలా మోహన్ బాబు విషయం ఒక కన్ఫ్యూజ్ గానే ఉంది. దాంతో మోహన్ బాబు ఏ పార్టీ అంటే ఠక్కున చెప్పడం కష్టమే. అయితే ఆయన తాను బీజేపీని ఇష్టపడే వాడినే అని ఆ మధ్య తిరుపతిలో చెప్పుకున్నారు కాబట్టి ఆయన ఆ పార్టీ అని కాసేపు అనుకుందాం.

ఇక ఆయన పెద్ద కుమారుడు సినీ నటుడు మంచు విష్ణుని తీసుకుంటే ఆయన వైసీపీ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సతీమణి స్వయాన జగన్ కి కజిన్ సిస్టర్. దాంతో జగన్ తో దగ్గర బంధుత్వం విష్ణుకు ఉంది. సో అలా చూసుకుంటే విష్ణు వైసీపీ మనిషిగానే చూడాలి. ఇక మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ఉన్నారు. ఆమె టీయారెస్ ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అంటే ఆ పార్టీ భావజాలం ఆమెను ఆకట్టుకుంది అనుకోవాలి. దాంతో ఆమె టీయారెస్ పార్టీ కిందనే లెక్క వేసుకోవాలి అంటారు.

ఇక మోహన్ బాబు రెండవ కొడుకు మంచు మనోజ్ ఉన్నారు. ఆయన ఇపుడు రెండవ వివాహం చేసుకుంటారు అని ప్రచారం సాగుతోంది. ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు రాయలసీమలో ప్రఖ్యాతి చెందిన ఒక రాజకీయ కుటుంబం అని అంటున్నారు. ఆ కుటుంబం ఇపుడు టీడీపీలో ఉంది. ఆ విధంగా చూస్తే మంచు మనోజ్ రాజకీయం అంతా టీడీపీ వైపుగా ఉండే చాన్స్ ఉంది అంటున్నారు.

ఇలా మోహన్ బాబు కుటుంబం గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇపుడు ప్రచారాన ఉన్నాయి మరి. చిత్రమేంటి అంటే మోహన్ బాబు ఫ్యామిలీ రాజకీయంలో తాము అని చెప్పుకున్నా మోహన్ బాబు జస్ట్ ఒకసారి రాజ్యసభ సభ్యుడు మాత్రమే అయ్యారు. అది కూడా ఇప్పటికి పాతికేళ్ళ క్రితం మాట. ఆ తరువాత ఆయన ఎన్ని పార్టీలు మారినా కూడా పదవులు మాత్రం రాలేదు. అంతవరకూ ఎందుకు వైఎస్ జగన్ పార్టీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అది జరాలేదు.

ఇక మంచు విష్ణు వైసీపీ అని అంటారు కానీ ఆయనకు కూడా అధికార పార్టీలో అంత సాన్నిహిత్యం ఉన్నట్లుగా అనిపించదు. వైసీపీలో జగన్ మాటే వేదం, ఇక బంధుత్వాలు అన్నవి కూడా పెద్దగా అక్కడ లెక్కలోకి తీసుకోరు అని చెబుతారు. మంచు లక్ష్మి విషయం తీసుకుంటే ఆమె టీయారెస్ ని ఎంతలా పొగిడినా ఎన్నికల రాజకీయాలోకి బహుశా అడుగుపెట్టకపోవచ్చు. దానికి కారణం ఆంధ్రా మూలాలే అని కూడా చెబుతారు. పైగా టీయారెస్ పట్ల ఆమె ఒక్కరే కాదు టోటల్ టాలీవుడ్ సానుకూలంగా ఉంది అని అంటారు. సో అది కూడా లెక్కలోకి రాదేమో

ఇక మనోజ్ రెండవ పెళ్ళి అన్నది ఒక పుకారుగా బయటకు వచ్చింది. ఒక వేళ అది నిజమై ఆయన రాజకీయ కుటుంబ నేపధ్యం ఉన్న ఆమెను వివాహం ఆడినా ఆయన ఎంతవరకూ టీడీపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటారు అన్నది కూడా ఒక చర్చగానే ఉంటుంది. అయితే ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. మనోజ్ కి రాజకీయాల పట్ల మక్కువ మాత్రం చాలానే ఉంది. పైగా ఆయన కూడా రాయలసీమకు చెందిన వారే. దాంతో ఏమో రేపు ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది మనోజేనా అంటే ఏమో. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రచారంలో ఉన్న విషయాలే. జస్ట్ ఆసక్తిగా చెప్పుకునే విషయాలు తప్ప మరేమీ కావు అంతే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.