Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కోసం న‌లుగురు పోటీ!

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:30 PM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కోసం న‌లుగురు పోటీ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో వైఎస్సార్సీపీ కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఇప్ప‌టికే అన్ని పార్టీల కంటే ముందుగా ఈ ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా గోదాలోకి దిగేసింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు ప్ర‌తి ఇంటినీ చుట్టేస్తున్నారు. ఈ మూడున్న‌రేళ్ల‌లో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం చేసిన ల‌బ్ధి గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కూడా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా 50 మంది కార్య‌క‌ర్త‌ల‌ను ఎంపిక చేసి అక్క‌డ పార్టీ ప‌రిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇబ్బందులు లేనిచోట మీరే ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ని ప‌నిచేసుకోవాల‌ని కొంత‌మంది ఇన్‌చార్జుల‌కు, ఎమ్మెల్యేల‌కు చెబుతున్నారు.

అయితే.. ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు మాత్రం వైఎస్సార్సీపీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా త‌యారైంద‌ని చెబుతున్నారు. ఇక్క‌డ ఆ పార్టీ ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి స‌రైన అభ్య‌ర్థి దొర‌క‌డం లేద‌ని అంటున్నారు. 2014లో గొట్టిపాటి భ‌ర‌త్ వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి ఏలూరి సాంబ‌శివ‌రావు చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఇక 2019లో వైఎస్సార్సీపీ ఇక్క‌డ అభ్య‌ర్థిని మార్చింది. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే ఆయ‌న కూడా ఓడిపోయారు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న క్రియాశీల‌కంగా లేరు.

మ‌రోవైపు ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు వైఎస్సార్సీపీలో, ఆయ‌న భార్య ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీలో ఉండ‌టాన్ని కొంత‌మంది వైఎస్సార్సీపీ నేత‌లు అభ్యంత‌ర‌పెట్టార‌ని గాసిప్స్ వినిపించాయి. ఈ విష‌యంలో వైఎస్ జ‌గన్ కూడా ఏదో ఒక పార్టీలో ఉండేలా మీ దంప‌తులే నిర్ణ‌యం తీసుకోవాల‌ని అప్ప‌ట్లోనే ద‌గ్గుబాటికి సూచించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో అప్ప‌టి నుంచి ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు వైఎస్సార్సీపీలో సైలెంట్ అయిపోయారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసే అభ్య‌ర్థి కోసం వైఎస్సార్సీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతానికి న‌లుగురు అభ్య‌ర్థులు పోటీలో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ద‌గ్గుబాటి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా త‌ప్పుకున్నాక రామ‌నాథంబాబు ప‌నిచేసుకుంటూ వ‌స్తున్నారు. ఆ త‌ర్వాత మాజీ మంత్రి గాదె వెంక‌ట రెడ్డి త‌న‌యుడు మ‌ధుసూద‌న్ రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియ‌మించే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పేరు చాలా గ‌ట్టిగా వినిపించింది. అందులోనూ చీరాల‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రామ్ ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీతో అంట కాగుతున్నారు. క‌ర‌ణం త‌న కుమారుడిని కూడా వైఎస్సార్సీపీలో చేర్పించిన సంగ‌తి తెలిసిందే.

ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం కోసం రామ‌నాథం బాబు, ఆమంచి కృష్ణ‌మోహ‌న్, గాదె మ‌ధుసూద‌న్ రెడ్డి ఉండ‌గా ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి.. కంది ర‌విశంక‌ర్ అనే వ్యాపార‌వేత్త‌ను వెంట‌బెట్టుకుని సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. ర‌విశంక‌ర్‌కు ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని కోరినట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు ఆగ‌స్టు మొదటి వారంలో రామనాథం బాబు సీఎం జ‌గ‌న్ ను కలిసిన‌ప్పుడు 'నియోజకవర్గంలో పని చేసుకోండి' అని ఆయనకు జ‌గ‌న్ చెప్పినట్లు స‌మాచారం. దీంతో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప‌ర్చూరులో పునఃప్రారంభించార‌ని తెలుస్తోంది. అయితే రామనాథం బాబు కలిసిన కొద్ది రోజుల తర్వాత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కూడా సీఎం జ‌గ‌న్‌ను కలిశారు. అయితే ఈ స‌మావేశం వివ‌రాలు బ‌య‌ట‌కు తెలియ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరులో న‌లుగురు అభ్య‌ర్థుల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎవ‌రికి ఓటేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.