Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురు సీనియ‌ర్లు ఇక అసెంబ్లీకి దూరం!

By:  Tupaki Desk   |   9 Feb 2019 7:30 AM GMT
ఆ న‌లుగురు సీనియ‌ర్లు ఇక అసెంబ్లీకి దూరం!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. రాజ‌కీయాలు ఇప్ప‌టికే బాగా వేడెక్కాయి. స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల్లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు అభ్య‌ర్థులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ద‌ఫా జ‌నం తీర్పు ఎలా ఉండ‌బోతోంది? ఎవ‌రెవ‌ర్ని ఆశీర్వ‌దించి అసెంబ్లీకి పంపిస్తారు? ఎవ‌రెవ‌ర్ని ఓట‌ర్లు ఇంటికే ప‌రిమితం చేస్తారు? అనే అంశాల‌పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. వంద‌ల‌ కొద్దీ విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

ఇత‌ర నేత‌ల సంగ‌తెలా ఉన్నా.. ఏపీ ప్ర‌స్తుత‌ అసెంబ్లీలోని ఓ న‌లుగురు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు మాత్రం విశ్లేష‌కుల లెక్క‌ల‌కు ఈ ద‌ఫా దూరం కానున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి వారు త‌ప్పుకుంటుండ‌ట‌మే అందుకు కార‌ణం. రాష్ట్ర విభ‌జన త‌ర్వాత కొలువుదీరిన ఏపీ తొలి అసెంబ్లీ చివ‌రి స‌మావేశాలు శుక్ర‌వారంతో ముగిశాయి. ఈ స‌భ‌లో స‌భ్యులుగా ఉన్న న‌లుగురు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు మ‌ళ్లీ అక్క‌డ అడుగు పెట్టే అవ‌కాశాలు దాదాపుగా లేన‌ట్లే.

ఉప ముఖ్య‌మంత్రి కె.ఈ.కృష్ణ‌మూర్తి - మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి - మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ - బొజ్జ‌ల గోపాల‌కృష్ణ రెడ్డి ఏపీలో కొలువుదీర‌నున్న రెండో అసెంబ్లీలో ఉండే అవ‌కాశాలు లేవు. కామినేని శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ పై విజ‌యం సాధించిన ఆయ‌న‌.. బీజేపీ-టీడీపీ పొత్తు కార‌ణంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఆపై ఇరు పార్టీల మ‌ధ్య విభేదాల‌తో మంత్రి ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌బోన‌ని కామినేని శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఉప ముఖ్య‌మంత్రి కె.ఈ.కృష్ణ‌మూర్తి వృద్ధాప్యం-అనారోగ్య స‌మ‌స్య‌ల‌ కార‌ణంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని యోచిస్తున్నారు. క‌ర్నూలు జిల్లాలో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌త్తికొండ సీటును కుమారుడు శ్యాం బాబుకు ఇప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌న పోటీ చేసే అవకాశాలు దాదాపు శూన్యం.

మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు లేవు. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఆపై టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌వి దక్కించుకున్నారు. అయితే - గ‌త ఎన్నిక‌ల్లో ఆది చేతిలో ప‌రాజ‌యం పాలైన రామ‌సుబ్బారెడ్డికే ఈ ద‌ఫా కూడా జ‌మ్మ‌లమ‌డుగు టికెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఆదిని క‌డ‌ప లోక్ స‌భ స్థానంలో బ‌రిలో దింపాల‌ను యోచిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంలో ఆదిని సీఎం ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. కాబట్టి ఆయ‌న కూడా ఈ ద‌ఫా అసెంబ్లీకి దూర‌మైన‌ట్లే. ఇక శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల గోపాల‌కృష్ణ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న కూడా ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌రు. త‌న కుమారుడు సుధీర్ రెడ్డికి ఈ ద‌ఫా టికెట్ ఇప్పించాల‌ని ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు.