Begin typing your search above and press return to search.

ప్రజా సంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు .. సీఎం జగన్ ట్విట్

By:  Tupaki Desk   |   6 Nov 2021 8:33 AM GMT
ప్రజా సంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు .. సీఎం జగన్ ట్విట్
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి రాష్ట్ర రాజకీయాలని తారుమారు చేసిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సరిగ్గా ఈరోజున నాలుగేళ్ల కిందట ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి, 341 రోజుల పాటు కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకొని.. 2019లో అధికారాన్ని చేపట్టారు. అసెంబ్లీ లో శపథం చేసి మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ లో అడుగుపెడతాని సవాల్ చేసి ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకొని అఖండమైన మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిని పురస్కరించుకొని ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి ,ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి అయ్యింది. ఇడుపుల పాయలో దిగవంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా జగన్‌ పాదయాత్ర సాగింది. అలాగే 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. క్షేత్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్‌ పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు. నేను ఉన్నానంటూ.. ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు.