Begin typing your search above and press return to search.

దేశంలో ఫోర్త్ వేవ్.. తెలంగాణపై డాక్టర్ గడల ఏమన్నారంటే..

By:  Tupaki Desk   |   21 April 2022 10:02 AM GMT
దేశంలో ఫోర్త్ వేవ్.. తెలంగాణపై డాక్టర్ గడల ఏమన్నారంటే..
X
అటు ఢిల్లీలో.. ఇటు కేరళలో కొవిడ్ వ్యాప్తి మళ్లీ కలకలం రేపుతోంది. మూడో వేవ్ ప్రాణ నష్టం లేకుండా తొందరగా ముగిసిందని సంబర పడుతుండగానే మరోసారి కొవిడ్ ఉనికి చాటుతోంది. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మిజోరం, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా ల్లో నూ ప్రభావం చూపుతోంది. బుధవారం 4.49 లక్షల పరీక్షలకు 2,380 కేసులు వచ్చాయి. ఢిల్లీలోనే 1,009 కేసులు రికార్దయ్యాయి. క్రితం రోజుకు ఇవి60 శాతం అధికం. అన్నిటికి మించి పాజిటివ్ రేటు 5.7కు చేరింది.

ఢిల్లీ, ఒడిశా, మిజోరంలో ఒక్కొక్కరు చనిపోయారు. కేరళ పాత మరణాలు కలుపుకొని 53 మంది చనిపోయినట్లు చెప్పింది. వాస్తవానికి ఇటీవల కోలుకున్నవారి కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ జాగ్రత్తల పాటింపు ను చర్చనీయాంశమైంది. కొన్నాళ్లుగా మాస్క్ ల వినియోగాన్ని ప్రజలు మర్చిపోయారు. టీకా తీసుకున్నామనే భ్రమలో ఉన్నారు.


జాగ్రత్తలు తప్పనిసరి అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు సూచించారు. కొవిడ్ పోలేదని.. మరో డు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయజాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.

హైదరాబాద్ లోనే కేసులు.. జిల్లాల్లో జీరో..

ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ లోనే కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లో జీరో ఉంటున్నాయి. మరోవైపు ఆస్ప్రత్రుల్లో కొవిడ్ తో చేరికలు కూడా జీరోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉందని డాక్టర్ గడల అంటున్నారు. ‘‘తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదు. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదు. ఆరు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్ అదుపులోనే ఉంది. కొన్ని చోట్ల ఫోర్త్‌ వేవ్ ప్రారంభమైంది.

థర్డ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. సీఎం గత నాలుగు రోజులుగా కొవిడ్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు. 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ పూర్తిగా ఫ్లూ లా మారే అవకాశం ఉంది’’ అని చెప్పారు.

టీకా తప్పనిసరి..

థర్డ్‌ వేవ్‌, వస్తుందో రాదో తెలియని ఫోర్త్ వేవ్‌ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందేనని, అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డాక్టర్ గడల సూచించారు. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలి’’ అని వివరించారు.