Begin typing your search above and press return to search.

ఫ్రీ.. ఫ్రీ.. గెలిస్తే.. ఇల్లు.. వాషింగ్ మెషిన్.. సోలార్ స్టవ్ ఇలాంటివెన్నో

By:  Tupaki Desk   |   15 March 2021 2:39 AM GMT
ఫ్రీ.. ఫ్రీ.. గెలిస్తే.. ఇల్లు.. వాషింగ్ మెషిన్.. సోలార్ స్టవ్ ఇలాంటివెన్నో
X
ఓటు వేయండి. మా పార్టీని గెలిపించండి. మేం అధికారంలోకి వస్తే చాలు.. ఉచితంగా అన్ని ఇచ్చేస్తామంటూ అన్నాడీఎంకే ఇచ్చిన ఎన్నికల హామీల్ని చూస్తే నోట మాట రాదంతే. ఇప్పటికే రాయితీలు.. నజరానాలు.. ఉచితాల మీద పన్ను చెల్లింపుదారులతోపాటు.. మధ్యతరగతి.. ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గాల వాదనను పట్టించుకోని రాజకీయ పార్టీలు.. ఉచితం పేరుతో ప్రకటిస్తున్న తాయిలాల స్థాయి మరో స్థాయికి చేరుకునేలా అన్నాడీఎంకే హామీల చిట్టా ఉంది.

తమిళనాడు అధికారపక్షంగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే తాజాగా తన ఎన్నికల హామీల్ని పెద్ద ఎత్తున వెల్లడిచింది. అమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రస్తుతం ఇళ్లు లేని వారికి ఇల్లు ఇస్తామని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల్ని గుర్తించి ఉచితంగా ఇల్లు కట్టిస్తామని పేర్కొంది. పట్టణ ప్రాంతాల వారికి అపార్ట్ మెంట్లను నిర్మించి ఇస్తామని పేర్కొంది. ఇంటికో ఉద్యోగంతో పాటు.. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వాషింగ్ మెషిన్లు.. ప్రతి ఇంటికి కేబుల్ టీవీతో పాటు.. సోలార్ స్టవ్ లను కూడా ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. రైతులకు రుణమాఫీ.. విద్యార్థులకు విద్యా రుణ మాఫీ.. ఏడాదంతా స్టూడెంట్స్ కు 2జీబీ డేటా ఉచితంతో పాటు.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని కూడా తగ్గిస్తామన్న హామీని ఇచ్చింది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహిణిలకు ప్రతి నెల రూ.1500 ఇస్తామని.. ఏటా ఆరు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొంది. సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టికెట్ ధరలో 50 శాతం రాయితీతో పాటు.. గ్రీన్ ఆటో రిక్షాలను కొనుగోలు చేసే ఆటో డ్రైవర్లకు రూ.25వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇలా అన్ని ఫ్రీ అంటున్న అన్నాడీఎంకే హామీల వర్షం అంతకంతకూ పెరుగుతోంది. మరి.. తమిళ ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.