Begin typing your search above and press return to search.

ఆరోగ్య‌శ్రీ‌ని తిర‌గ‌రాసిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   7 April 2018 5:45 PM GMT
ఆరోగ్య‌శ్రీ‌ని తిర‌గ‌రాసిన జ‌గ‌న్‌
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్ ప్రసంగిస్తూ ఇటు రాజ‌కీయాల‌పై అటు ప్ర‌జా సంక్షేమంపై ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం హోదాలో కేంద్రాన్ని అడిగి ఉంటే ఎప్పుడో వచ్చేదని కానీ అలా చేయ‌కుండా ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన ధ్వజమెత్తారు.నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై ఎక్కడా విచారణ చేపడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

తెనాలి ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారీస్‌ గా కూడా పిలుస్తారని కవులకు - కళాకారులకు ఇది నిలయమ‌ని జ‌గ‌న్ అన్నారు. `ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పచ్చ తొక్కాలు పీక్కుతింటున్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చే సమయంలో అడుగడుగునా అన్నా..కృష్ణా నదిని ఇష్టం వచ్చినట్లు ఇసుకను దోచుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, కలెక్టర్‌ వరకు లంచాలు, చిన్నబాబు, పెద్దబాబు జేబుల్లోకి లంచం సొమ్ము వెళ్తోంది. పెద్దబాబు పై నుంచి దగ్గరుండి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఇంత అన్యాయంగా ముఖ్యమంత్రి భాగస్వామి ఉండి ఇసుకను దోచుకుంటుంటే ఇంకెవ‌రు న్యాయం చేస్తారు? ` అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గట్టిగా అడిగి ఉంటే ఈ పాటికి హోదా వచ్చి ఉండేదని జ‌గ‌న్ అన్నారు.` ప్రధానిని గట్టిగా నిలదీసి ఉంటే మన పరిస్థితి మారేది. ఈ పెద్ద మనిషి చేస్తున్న మోసం ప్రజలను ప్రత్యేక హోదా విషయంలో మభ్యపెట్టడమే. ఇవాళ మన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశానికి చూపాలని ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈ ఐదుగురు ఎంపీలకు తోడు 25 మంది ఎంపీలు ఒకతాటిపైకి వచ్చి రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యేది. ప్రధాని దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారు కాదా? అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేస్తున్నది ఏంటో తెలుసా? అఖిలపక్షం అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించడం లేదు. ఇదే పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఏపీకి చెందిన ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఏమి జరగనట్లుగా సైకిల్‌ తొక్కుతుంటే ఈయన ఒక మనిషేనా?` అంటూ జ‌గ‌న్ మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా త‌న ప్రణాళిక‌ల‌ను వైస్ జ‌గ‌న్ పంచుకున్నారు. `దివంగ‌త వైఎస్ త‌న‌యుడిగా సంక్షేమంలో మ‌రో రెండు అడుగులు ముందుకు వేస్తాను. పేదవాడి వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాను. ఉచితంగా వైద్యం అందిస్తాను. ప్రతి పేదవాడికి ఆపరేషన్‌ చేయించడమే కాదు...డాక్టర్లు రెస్టు తీసుకోమని చెబుతారు. ఆ సమయంలో ఆ కుటుంబం పస్తులు ఉండకూడదని విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాను. ఏ పేదవాడు కూడా పస్తు పడుకునే పరిస్థితి రానివ్వను. హైదరాబాద్, బెంగలూరు వెళ్తే ఆపరేషన్‌ చేయించను అని చంద్రబాబు అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఉచితంగా చేయిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10 వేలు పింఛన్‌ ఇస్తామని మాట ఇస్తున్నాను.` అంటూ జ‌గ‌న్ త‌న ప్ర‌ణాళిక వివ‌రించారు.