Begin typing your search above and press return to search.

మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సులేనా.. థియేట‌ర్ల‌లోనూ ఫ్రీ!

By:  Tupaki Desk   |   23 March 2018 5:34 AM GMT
మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సులేనా.. థియేట‌ర్ల‌లోనూ ఫ్రీ!
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కాస్త అటూ ఇటూగా అంద‌రూ మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సుల‌కు వెళ్లే వారు. ఇలాంటి వారిపై పార్కింగ్ ఫీజు పేరుతో చేసే బాదుడు ఒక రేంజ్లో ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో సినిమా టికెట్‌కు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా పార్కింగ్ ఫీజు వ‌సూలు చేసే మాల్స్ లేవు. కాకుంటే.. ప్రీమియం సేవ‌ల పేరుతో బాదేస్తుంటారు.

ఇలాంటి తీరుపై న‌గ‌ర ప్ర‌జ‌లు ఏళ్ల‌కు త‌ర‌బ‌డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా.. ప్ర‌భుత్వాల్లో మార్పు లేదు. ఇలాంటి వేళ‌.. తెలంగాణ పుర‌పాల‌క శాఖ కొత్త పార్కింగ్ పాల‌సీని ప్ర‌క‌టించింది. ఇందులో.. మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సుల్లో ఎలాంటి పార్కింగ్ ఫీజు ఉండ‌ద‌ని తేల్చేసింది. మాల్స్ కు.. మ‌ల్టీఫ్లెక్సుల‌కు వెళ్లే వారి నుంచి ఎలాంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌మ‌ని.. ఒక‌వేళ‌.. సినిమా చూడ‌కుండా.. ఎలాంటి షాపింగ్ చేయ‌ని వారిపై మాత్రం పార్కింగ్ రుసుము చెల్లించాల‌ని నిర్ణ‌యించారు.

ఇందుకోసం కొన్ని విధివిధానాల్ని రూపొందించారు. మాల్స్ కు.. మ‌ల్టీఫ్లెక్సుల విష‌యంలో రూల్స్ ఫ్రేమ్ చేసిన ప్ర‌భుత్వం.. సాధార‌ణ థియేట‌ర్ల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టంపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వేళ‌.. సాధార‌ణ థియేట‌ర్ల‌లో పార్కింగ్ మాటేమిట‌న్న ప్ర‌శ్న‌కు.. అలాంటి వాటికి కూడా ఉచితంగానే పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించాల‌న్న అంశంపైనా రూల్స్ ఫ్రేం చేస్తామ‌ని చెబుతున్నారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో దాదాపు 200 వ‌ర‌కు థియేట‌ర్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ వ‌ర్గాలు చెప్పేదేమంటే.. థియేట‌ర్ల‌లోనూ ఉచిత పార్కింగ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల్సిందే. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ టూ వీల‌ర్ల‌కు రూ.20 నుంచి రూ.30 వ‌ర‌కు.. కార్ల‌కు రూ.30 నుంచి రూ.50 వ‌ర‌కూ థియేట‌ర్ల వ‌ర్గాలు వ‌సూలు చేస్తున్నాయి. అయితే.. మారిన నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏప్రిల్ 1 నుంచి పార్కింగ్ చార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ‌.. రూల్స్ కు భిన్నంగా పార్కింగ్ చార్జీలు వ‌సూలు చేసిన ప‌క్షంలో.. భ‌వ‌న య‌జ‌మానిపై భారీ జ‌రిమానా ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఉచిత పార్కింగ్ కార‌ణంగా ఆర్థికంగా న‌ష్టం వ‌స్తుంద‌న్న మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సుల య‌జ‌మానుల‌తో అధికారులు వేర్వేరుగా స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌ని.. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాల‌సీని వివ‌రిస్తార‌ని చెబుతున్నారు. భ‌వ‌న నిర్మాణ నిబంధ‌న‌ల ప్ర‌కారం వాణిజ్య భ‌వ‌నాల్లో పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించాల్సిన బాధ్య‌త ఆయా సంస్థ‌ల య‌జ‌మానుల‌దేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తుంది. మొత్తంగా చూస్తే.. థియేట‌ర్ల‌లోనూ ఫ్రీ పార్కింగ్ అన్న‌ది ఉంటుంద‌ని జీహెచ్ ఎంసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి.. థియేట‌ర్ల య‌జ‌మానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే.. పార్కింగ్ ఫీజు పేరుతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఆదాయం భారీగా ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.