Begin typing your search above and press return to search.

తమిళనాడు ఫ్రీ సరుకు ఎలా ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   15 May 2016 8:05 AM GMT
తమిళనాడు ఫ్రీ సరుకు ఎలా ఉందో తెలుసా?
X
తమిళనాడులో పోలింగ్ కు గట్టిగా 24 గంటల సమయం కూడా లేదు.. తాజాగా ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లోని మిగతా మూడు రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న పుదుచ్ఛేరి ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల ప్రజాకర్షక విధానాలపై ఆధారపడి ఉన్నాయి. దేశంలో మరెక్కడాలేని స్థాయిలో ఈసారి తమిళపార్టీలు ఓటర్లకు భారీ తాయిలాలు ఎరచూపాయి. తాము అధికారంలోకొస్తే ప్రతి ఇంటిని స్వర్గధామంగా మారుస్తామని ప్రకటించాయి. ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల నుంచి సౌందర్యసాధనాల వరకు ఉచితంగా ఇంటింటికి అందిస్తామని ఆశలు చూపించాయి. తమిళ ఓటర్లకు ఇలాంటి హామీలు కొత్తేంకాదు.

గత రెండు ఎన్నికల్లోనూ వారు ఈ హామీలు చూశారు. గతంలోనూ అధికారంలోకొచ్చీరాగానే తమిళపార్టీలు తమ హామీల్ని అమల్లో పెట్టాయి. ఈ క్రమంలో ప్రజలకంటే ఉత్పత్తిదార్లే అధికంగా లాభపడ్డారు. గత ఎన్నికల్లో ఇంటింటికి కలర్‌ టీవీల్ని ప్రభుత్వమే పంపిణీ చేసింది. వాటికి కేబుల్‌ కనెక్షన్లు కూడా ఫ్రీగా అందిం చింది. ఉచితంగా ఫ్యాన్లు ఇంటింటికీ ఇచ్చింది. కరెంట్‌ ఇస్త్రీ పెట్టెల్ని కూడా ఉచితంగానే సరఫరా చేసింది. ఇంటింటికి మిక్సీలు ఇచ్చింది. విద్యార్థులకు లాప్‌ ట్యాప్‌ లిచ్చింది. నిరుద్యో గులకు కంప్యూటర్‌లు అందించింది. ఇవన్నీ కూడా ఉచితంగానే.

అయితే ఈ ఉచిత సరకు బతుకు ఎంతన్నది తమిళనాడు ప్రజలను అడిగితే చెబుతారు. ఏ వస్తువు కూడా ఆరు నెలలకు మించిపనిచేయదట. ప్రభుత్వమిచ్చిన కలర్‌ టీవీలు కాలిపోతున్నాయట. ఫ్యాన్లలో వైండింగ్‌ కాలిపోయింది. ఇక లాప్‌ టాప్‌ లైతే మూడు నెలలకే మూలనపడ్డాయి. మిక్సీలు గ్రైండర్లు కూడా గట్టిగా ఆర్నెళ్లు పనిచేస్తే ఆశ్చర్యమే. ఇదే ఎన్నికల్లో జయలలిత ఇచ్చిన హామీ మేరకు అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అతి తక్కువ ధరలకే ఫలహారాలతో పాటు భోజనాల్ని జనానికి అందుబాటులో పెట్టారు. ఈ పథకానికి ప్రజల విశ్వాసం దక్కింది.

అయితే వేల కోట్లు వ్యయం చేసి చేపట్టిన వస్తువుల పంపిణీ మాత్రం ప్రభుత్వానికి అప్రతిష్టను మిగిల్చింది. ఇందుకు కారణం పథకం కంటే పథకాల ఆచరణలో జరుగుతున్న వైఫల్యాలే. వస్తువుల నాణ్యతలో లోపాలే. దీంతో కొత్తగా మరిన్ని ఉచితాలు ప్రకటించినా వాటికీ ఇదే గతి పడుతుందని జనం అనుకుంటున్నారు. ఈ దశలో తమిళనాడు ఫలితాలు ఆ రాష్ట్రానికే కాదు.. యావత్‌ దేశానికి సంకేతాలు కానున్నాయి. జనం అభివృద్ధికి ఓటేస్తారా లేక వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీటేస్తారా ? ఉచిత తాయిలాలకు ఆశపడతారా లేదంటే ఆలోచించి ఓటేస్తారా అన్నది చూడాలి.