Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ సేల్స్ చరిత్రలోనే కొత్త రికార్డు ఫ్రీడమ్

By:  Tupaki Desk   |   18 Feb 2016 8:55 AM GMT
ఆన్ లైన్ సేల్స్ చరిత్రలోనే కొత్త రికార్డు ఫ్రీడమ్
X
టాటా నానో కార్ లాంఛింగ్ కు ముందు దేశం ఎంతగా ఆసక్తిగా చూసిందో ఇప్పుడు రూ.251 ఫ్రీడమ్251 కోసం అంతకంటే ఆసక్తిగా ఎదురుచూశారు ప్రజలు.. గురువారం ఉదయం 6 గంటల నుంచి రిజిస్ర్టేషన్లు మొదలవుతాయి అనగానే బారెడు పొద్దెక్కేవరకు లేవనివారు కూడా 5 గంటలకే అలారం పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్లకు రెండు రోజుల సమయం ఉన్నా కూడా అనుకున్న కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వస్తే ఆపేస్తారేమో అన్న అనుమానంతో స్టార్టింగ్ లోనే నమోదు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్లే పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దీంతో సర్వర్లపై తాకిడి అధికమై పనిచేయడం మానేశాయి. కోట్లాది మందికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమే కలగలేదు. అయినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి సంఖ్య కూడా కోట్లలో ఉందని అంచనా. సెకనుకు 6 లక్షల హిట్లు వచ్చాయని సంస్థ ప్రకటించింది. అయితే... అనూహ్య తాకిడి వల్ల సర్వర్లపై భారం పెరిగింది. వాటిని అప్ గ్రేడ్ చేయడం కోసం ప్రీడమ్ సంస్థ ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది.

కాగా 24 గంటల్లోగా సాంకేతికంగా అప్ డేట్ అయి మళ్లీ రిజిస్ట్రేషన్లు స్వీకరించడానికి ఫ్రీడమ్ ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలన్నీ అనేక అనుమానాలను వ్యక్తంచేస్తున్నాయి. ఆ కాన్ఫిగరేషన్ ఫోన్ కావాలంటే కనీసం రూ.1500 నుంచి రూ.2 వేలు అవసరమని... 250కే ఎలా ఇస్తారన్నది ఇప్పటికీ తమకు అనుమానమేనని అంటున్నాయి. సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారందరికీ ఫోన్లు అందితే కానీ అసలు సంగతి తెలియదని అంటున్నారు. కాగా ఇప్పుడు నమోదు చేసుకుంటున్న మరో నాలుగు నెలలవరకు డెలివరీ చేయలేమని ఫ్రీడమ్ సంస్థ చెబుతోంది.