Begin typing your search above and press return to search.

22,439 పేజీల దేశ రహస్యం లీక్

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:42 AM GMT
22,439 పేజీల దేశ రహస్యం లీక్
X
దేశానికి కీలకమైన రహస్య సమాచారం బయటకు పొక్కింది. అది కూడా భారీగా. జలాంతర్గాములకు సంబంధించిన కీలక సమాచారం బయటకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత నౌకాదళం కోసం ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్ ఎస్ తో కలిసి రూ.23,500 కోట్లతో రూపొందిస్తున్న ఆరు ఆత్యాధునిక స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించిన సీక్రెట్స్ బయటకు పొక్కటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. బయటకు పొక్కిన సమాచారం 23,439 పేజీలుగా ఆస్ట్రేలియాకు చెందిన మీడియా సంస్థ ఒకటి సంచలన కథనాన్ని వెల్లడించింది.

తాజాగా లీకైన సమాచారం మొత్తం మాజీ ఫ్రెంచ్ నౌకాదళ అధికారి కారణంగా చెబుతున్నారు. సదరు మాజీ అధికారి కారణంగానే సీక్రెట్స్ బయటకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ తాజా లీకుల కారణంగా ఒక్క భారత్ కు మాత్రమే కాదు.. ఇదే జలాంతర్గాముల్ని వినియోగిస్తున్న మలేసియా.. చిలీతో పాటు మరో రెండేళ్ల వ్యవధిలో వీటినే వినియోగించనున్న బ్రెజిల్ కు సైతం ఇది ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించిన ఏయే అంశాలు లీకయ్యయన్నమాటకు భారీ చిట్టానే చెబుతున్నారు.

సాంకేతికంగా లీకైన సమాచారం విషయానికి సంబంధించి ‘ద ఆస్ట్రేలియన్’ అన్న మీడియా సంస్థ కథనం ప్రకారం సబ్ మెరైన్ల అండర్ వాటర్ సెన్సర్లకు సంబంధించి 4457 పేజీలు.. ఉపరితల సెన్సర్లకు సంబంధించి 4209 పేజీలు.. కంబాట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ కు సంబంధించి 4301 పేజీలు.. టార్పెడో లాంచింగ్ సిస్టం.. స్పెసిఫికేషన్లు 493 పేజీలు.. నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించి2138 పేజీలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ లీకు కారణంగా జరిగే నష్టం ఏమిటన్న విషయానికి వస్తే.. అత్యంత కీలకమైన జలాంతర్గాములకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కటం భారత్ కు శత్రుదేశాలైన పాక్.. చైనా లాంటి దేశాలు ఈ సమాచారం భారత జలాంతర్గాముల గుట్టుమట్లను తెలుసుకునే వీలుంటుంది.

తాజాగా లీకైన సమాచారం ప్రకారం సముద్రంలో ఏ లోతులో జలాంతర్గగామి ప్రయాణిస్తుందన్న అంశాలతో పాటు.. ఎంత లోతులో జలాంతర్గామి ఉంది? ఏయే ఫ్రీక్వెన్సీల్లో అవి సమాచారాన్ని సేకరిస్తాయి? శత్రువులకు దొరక్కుండా జలాంతర్గామి సిబ్బంది ఎక్కడ నుంచి మాట్లాడుకోగలరు? శత్రు నౌకా విధ్వంసక అయుధాల్ని ప్రయోగించే వ్యవస్త ఎక్కడ ఉంటుంది? నౌక వేగం.. ఏ వేగంతో వెళుతున్నప్పుడు ఎంత శబ్దం చేస్తాయి? ఎంత లోతు వరకు వెళ్లగలదు? జలాంతర్గామి పైకి తేలినప్పుడు ఏర్పడే రేడియేటెడ్ శబ్ధ స్థాయిలు.. ఇలాంటి విషయాలు వెల్లడైనట్లుగా లీక్ విషయాన్నిబయటపెట్టిన ద ఆస్ట్రేలియన్ పత్రిక వెల్లడించటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. దీనిపై భారత నౌకాదళం స్పందించింది. లీకైన సమాచారానికి సంబంధించి వివరాలు పాతవేనని.. సబ్ మెరైన్ల ప్రాథమిక స్థాయిలోనే చాలా మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నాయి. అయితే.. లీకు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందేనని పేర్కొంటోంది. ఇదిలా ఉంటే.. జలాంతర్గాముల్ని తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ డీసీఎన్ ఎస్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. దీనికి బాధ్యులు ఎవరు? ఏయేపత్రాలు లీకయ్యాయి? ఎలా లీకయ్యాయి? అన్న విషయాల్ని దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొంది.

ఓపక్క లీకు వ్యవహారం దుమారం రేపుతుంటే.. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ రగడ మొదలైంది. జలాంతర్గాముల డేటా లీక్ కావటం సిగ్గుచేటు వ్యవహారంగా కాంగ్రెస్అభివర్ణించింది. ఇలాంటి ఘోర తప్పిదంపై జవాబుదారీ వహించకుండా మోడీ సర్కారు ఆపరేషన్ కవర్ అప్ లకు పాల్పడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించిన మూలాలు విదేశాల్లో ఉన్నట్లుగా రక్షణ మంత్రి పారీకర్ పేర్కొనగా.. జలాంతర్గామిని తయారు చేసిన సంస్థ మాత్రం దీని మూలాలు భారత్ లో ఉన్నట్లుగా పేర్కొనటం మోడీ సర్కారుకు చిరాకు కలిగించే అంశంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. రాజకీయ పక్షాలు తమపై దాడి షురూ చేసిన నేపథ్యంలో పారికర్ స్పందించారు. జలాంతర్గాములకు సంబంధించిన వందశాతం సమాచారం లీక్ అయ్యిందని తాము భావించట్లేదని.. వాటికి సంబంధించిన మార్పులు ఎక్కువభాగం భారత్ చేతుల్లో ఉందన్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏ రూపులోకి వెళుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.