Begin typing your search above and press return to search.

చనిపోయిన ఫ్రెండుతో గోల్ కొట్టించారు

By:  Tupaki Desk   |   16 Jun 2020 11:50 AM GMT
చనిపోయిన ఫ్రెండుతో గోల్ కొట్టించారు
X
అతనో 16 ఏళ్ల కుర్రాడు. అతడికి ఫుట్ బాల్ అంటే పిచ్చి. తన స్నేహితులతో కలిసి స్కూల్ స్థాయి నుంచి జట్టులో ఆడుతున్నాడు. ఆ జట్టులో అందరికీ అతనంటే ప్రాణం. ఐతే హఠాత్తుగా ఆ కుర్రాడు ఇప్పుడు ప్రాణం కోల్పోయాడు. అతణ్ని దుండగులు హత్య చేశారు. ఈ స్థితిలో ఆ కుర్రాడికి ఎలా నివాళి అర్పించాలని ఆలోచించారు. స్నేహితులు. చిన్న ఫుట్ బాల్ మైదానం సెటప్ సెట్ చేశారు. అక్కడ అతడితో గోల్ కొట్టించారు. ఆ తర్వాత అందరూ అతడి చుట్టూ మూగారు. గోల్ కొట్టినందుకు అభినందనల్లో ముంచెత్తారు. తర్వాత అందరూ బోరుమన్నారు. సంబంధిత వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మెక్సికోలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు అందరి హృదయాల్ని ద్రవింపజేస్తోంది. దీని వివరాల్లోకి వెళ్తే..

అలెగ్జాండర్ మార్టినెజ్ అనే కుర్రాడికి ఫుట్ బాల్ పిచ్చి. జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. కారణాలేంటో కానీ.. కొందరు అతణ్ని హత్య చేశారు. అలెగ్జాండర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడ ఉన్న స్నేహితులు తమ ఆప్త మిత్రుడికి కడసారి నివాళి అర్పించాలనుకున్నారు. దగ్గర్లో ఒక ఫుట్ బాల్ మైదానం సెటప్ ఏర్పాటు చేశారు. అవతల గోల్ పోస్ట్ ఉండగా.. దగ్గర్లో మిత్రుడి మృత దేహం ఉన్న కాఫిన్‌ను పెట్టారు. దానికి సమీపంలో మిత్ర బృందం అంతా నిల్చుంది. అందులో ఒకరు బంతిని కాఫిన్ వైపు తన్నగా.. అది దాన్ని తాకి గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్లింది. గోల్ కీపర్ దాన్ని అందుకోబోయి విఫలమైనట్లు నటించాడు. బంతి గోల్ పోస్టులోకి వెళ్లింది. రిఫరీ గోల్ అని సిగ్నల్ ఇచ్చాడు. మిత్రులందరూ వెళ్లి కాఫిన్ చుట్టూ చేరి గోల్ చేసినందుకు అలెగ్జాండర్‌ను అభినందించారు. టీనేజీ కుర్రాళ్లు ఇంతగా ఆలోచించి తమ మిత్రుడికి వీడ్కోలు పలికిన తీరు అందరినీ కదిలిస్తోంది.