Begin typing your search above and press return to search.

జంపింగ్‌..అంత‌లోనే రివ‌ర్స్ జంపింగ్‌..అత‌డికే చెల్లు

By:  Tupaki Desk   |   16 Jan 2019 6:22 AM GMT
జంపింగ్‌..అంత‌లోనే రివ‌ర్స్ జంపింగ్‌..అత‌డికే చెల్లు
X
రాజ‌కీయాల్లో జంపింగ్స్ ఇప్పుడు చాలా మామూల‌య్యాయి. నేత‌ల అవినీతిని ప్ర‌జ‌లు ఎలా ప‌ట్టించుకోవ‌టం లేదో.. తాము ఓట్లు వేసిన నేత‌లు పార్టీలు మారినా లైట్ తీసుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్నించే త‌త్త్వం లేక‌పోవ‌టం.. ఏం చేసినా ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన అన్వ‌యాన్ని చేసుకోవ‌టం.. ప‌వ‌ర్లో ఉన్నోళ్ల‌కు పాహిమాం.. పాహిమాం అంటూ వీర విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు ఇప్పుడు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

నిల‌దీసే తీరు ప్ర‌జ‌ల్లో లేన‌ప్పుడు ఏ రాజ‌కీయ నేత అయినా త‌మ స్వార్థం చూసుకుంటారు కానీ మిగిలిన‌వేమీ ప‌ట్టించుకోరు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే అక్క‌డ‌కు.. ఎక్క‌డ మంచి పోస్టింగ్ ఇస్తానంటే అక్క‌డ‌కు వెళ్లిపోవ‌టం మామూలైంది. సంక్రాంతి పండ‌గ పూర్తి అయ్యేస‌రికి క‌ర్ణాట‌క‌లో జేడీఎస్.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెల్లు చీటి ఇచ్చేసి.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ప‌వ‌ర్లోకి తీసుకురావాల‌న్న ప్లానింగ్ లో క‌మ‌ల‌నాథులు ఉండ‌టం తెలిసిందే

ఇందులో భాగంగా ఇప్ప‌టికే బీజేపీ ఎమ్మెల్యేల‌ను తాము ప‌వ‌ర్లో ఉన్న హ‌ర్యానాకు త‌ర‌లించ‌టంతో పాటు.. అధికార‌ప‌క్షానికి షాకులు ఇచ్చేలా.. ఆపార్టీకి చెందిన నేత‌ల‌కు వ‌ల వేయ‌టం షురూ చేశారు. త‌మ‌తో చేతులు క‌లిపితే ప‌ద‌వులు ఇస్తామ‌న్న ఆశ‌ల్ని పెడుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో జేడీఎస్- కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్న శంక‌ర్ అనే ఎమ్మెల్యే ఒక‌రు తాజాగా బీజేపీలోకి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. పార్టీలో చేరితే మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న య‌డ్యుర‌ప్ప మాట‌తో శంక‌ర్ తాను మ‌ద్ద‌తు ఇస్తున్న పార్టీకి కాకుండా ప్ర‌త్య‌ర్థి ప‌క్షంలో చేరిపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో.. బీజేపీ వ్యూహం వ‌ర్క్ వుట్ కానున్న‌ట్లుగా సీన్ మారింది.

ప‌వ‌ర్ లేకుండానే ఇంత క‌త న‌డిపిస్తే.. ప‌వ‌ర్లో ఉన్నోళ్లు మ‌రెంత క‌త న‌డిపిస్తార‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే జేడీఎస్- కాంగ్రెస్ కు చెందిన నేత‌లు సీరియ‌స్ గా రంగంలోకి దిగి.. క‌మ‌ల‌నాథుల్లో క‌లిసిపోవాల‌ని డిసైడ్ చేసిన శంక‌ర్ కు బ్రైన్ వాష్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. జంప్ అయిన శంక‌ర్ గంట‌ల వ్య‌వ‌ధిలో సొంత‌గూటికి రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. జంప్ కావ‌టం.. అంత‌లోనే రివ‌ర్స్ జంప్ అవుతున్న ఉదంతాల‌తో ఎప్పుడు ఏమ‌వుతుంద‌న్న‌ది అర్థం కాని రీతిలో రాజ‌కీయాలు మారిపోయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.