Begin typing your search above and press return to search.

కొత్త చట్టం : 12 గంటల పని.. జీతంలోనూ సమూల మార్పులు

By:  Tupaki Desk   |   10 Jun 2022 11:30 AM GMT
కొత్త చట్టం : 12 గంటల పని.. జీతంలోనూ సమూల మార్పులు
X
అమెరికాలోని చికాగోలో కార్మికుల పోరాటం ఫలించి అప్పటి నుంచి కేవలం 8 గంటల మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పని జరుగుతోంది.కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం కొత్త కార్మిక చట్టం అమలు చేయబోతోంది. ఇది అమల్లోకి వస్తే ఇక పనిగంటలు కూడా పెరుగుతాయి. 8 గంటల నుంచి 12 గంటలుగా మారుతాయి.

ప్రస్తుతం ఎక్కడైనా పనిగంటలంటే 8 గంటలు మాత్రమే. ఉద్యోగులు, కార్మికులు సానుకూలంగా ఉంటే మరో గంటపాటు పనిచేస్తారు.కానీ కేంద్రప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టాన్ని తయారు చేస్తోంది. ఈ చట్టాన్ని జులై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రం ప్రయత్నాలు గనుక సక్సెస్ అయితే పనిగంటలతోపాటు అనేక చట్టాలు కూడా మారిపోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి.

కొత్త చట్టంలో పనిగంటలు, భవిష్యనిధి, ఇంటికి తీసుకెళ్లే వేతనం లాంటి అనేక అంశాల్లో సమూల మార్పులు వచ్చేస్తాయి. పెట్టుబడులను తీసుకురావడం.. ఉద్యోగ అవకాశాలను పెంచడం కోసమే నాలుగు కార్మిక చట్టాలను కొత్తవి తీసుకొస్తున్నట్టు కేంద్రం గతంలోనే ప్రకటించింది.

ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యరక్షణ, పని పరిస్థితుల్లో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యమని నరేంద్రమోడీ సర్కార్ ప్రకటించింది. కేంద్రం చేసిన సంస్కరణల ప్రకటనలను ఉద్యోగ, కార్మిక సంఘాలేవీ నమ్మడం లేదు.

ఎందుకంటే గడిచిన 8 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యోగులు, కార్మిక సంఘాల సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటివరకూ ఒక్క నిర్ణయం తీసుకోలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఇకవేళ కొత్త కార్మిక చట్టం అమల్లోకి వస్తే ఇక నుంచి ఉద్యోగులు, కార్మికుల పనిగంటలు 8 గంటల నుంచి 12 గంటల వరకూ పెరుగుతుంది. వారానికి 48 గంటలకు మించి పనిచేయకూడదని చట్టంలోనే ఉంది. కొత్త చట్టం ప్రకారం చూస్తే వారంలో పనిదినాలు 4 మాత్రమే అని అర్థమవుతోంది. కానీ ఈ విషయం కొత్త చట్టంలో ఎక్కడలేకపోవడం గమనార్హం.

పనిచేసే సయమం పెరగడంతో కార్మికుల ఈపీఎఫ్ పెరుగుతుంది. గ్రాస్ శాలరీలో 50 శాతం బేసిక్ ఉంటుంది. అయితే ఇన్ని గంటలు పనిచేస్తే కార్మికుల ఆరోగ్యం ఏమవుతుందన్న దానిపై మాత్రం మోడీసార్ ఆలోచించకపోవడం గమనార్హం.