Begin typing your search above and press return to search.

డోన్ల యుగం రాబోతుందా!

By:  Tupaki Desk   |   5 Feb 2019 1:30 AM GMT
డోన్ల యుగం రాబోతుందా!
X
డ్రోన్ పేరు వినగనే మనకు ముందుగా గుర్తొచ్చేది గాల్లో ఎగిరే బుల్లి హెలీక్యాప్టర్ గా కనిపిస్తుంటుంది.. కొందరికి వీడియో గేమ్స్ ఆడుకునే వస్తువని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు డ్రోన్లతో వ్యాపారం చేయడానికి త్వరలో అనుమతులు రాబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ట్రాన్స్ పోర్టు రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

విదేశాల్లో డ్రోన్లతో వ్యాపారం పాపులర్ అవుతుండగా మనదేశంలో మాత్రం ఇంకా పురిటి దశలోనే ఉంది. దేశంలో ఇప్పటివరకు డ్రోన్ల గురించి పెద్ద ప్రచారం జరుగడం లేదు. అక్కడక్కడ ఒకటో అరా వీటిని కొందరు వినియోగిస్తున్నా ప్రజలకు వీటి గురించి తెల్సింది మాత్రం కొంతే అని చెప్పాలి. పౌర విమానశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇటీవల ‘డ్రోన్ల పాలసీ’ తీసుకొస్తామని వెల్లడించడంతో డోన్ల వినియోగంపై పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

డ్రోన్ల ద్వారా ఆసుప్రతుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర మందులు - దాతలిచ్చిన అవయవాలను సకాలంలో చేర్చి వారి ప్రాణాలను రక్షించే వీలుంటుంది. అలాగే మారుమూల ప్రాంతాలకు - వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా డ్రోన్లు ఉపయోగపడుతాయి. వీటిని ప్రాధాన్యత గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది.

జోమాటో - అమోజాన్ వంటి సంస్థలు కూడా తమ ప్రొడక్ట్ డెలివరీల కోసం వీటిని వినియోగించుకునేందుకు ఆరాటపడుతున్నాయి. అదేవిధంగా ఉబెర్ సంస్థ తమ ఆహార పదార్థాలను చేరవేసేందుకు డ్రోన్లను ఆశ్రయించాలనుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలు ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ప్రభుత్వం డ్రోన్ల పాలసీ ప్రకటిస్తామని చెప్పడంతో మళ్లీ ఆశలు మొలకెత్తుతున్నాయి.

వచ్చే ఐదు-పదేళ్లలో డ్రోన్ల పరిశ్రమను 1980నాటి కంప్యూటర్ ఇండస్ట్రీతో పొల్చవచ్చని బెంగళూరులోని స్కై లార్క్ డ్రోన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముగిలన్ రామస్వామి చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఇది ఒక హాబీగా మాత్రమే ఉందని పరిశ్రమగా నిలదొక్కుకోలేదని తెలిపారు. ప్రభుత్వం ఈ పరిశ్రమకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తే పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు వ్యాపారాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకవేళ ప్రభుత్వం డ్రోన్ల రాకకు లైన్ క్లీయర్ చేసినట్లయితే ట్రాన్స్ పోర్టు రంగం ఇక గాల్లో ఎగురగడం ఖాయంగా కనిపిస్తుంది. డ్రోన్ల రాకతో ట్రాన్స్ పోర్టు రంగంతోపాటు డెలివరీ - వ్యవసాయం - ఫుడ్ సంబంధం ఉత్పతులు, పలు రంగాలకు మంచి రోజులు రానున్నాయి. వినియోగదారుడికి త్వరగా వస్తువును చేరిస్తే వినియోగదారుడితోపాటు ప్రొడక్ట్ ఉత్పత్తిదారుడికి ఎంతో మేలు జరుగుతుంది. ఏదిఏమైనా డ్రోన్ల రాకకు కొంత టైమ్ పట్టినా ఈ పరిణామం మాత్రం ఆహ్వానించదగినదే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్నది డ్రోన్ల యుగమేనని చెప్పక తప్పదేమో.. చూడాలి మరీ ఎంత త్వరగా ప్రభుత్వం డ్రోన్ల రాకకు లైన్ క్లియర్ చేస్తుందో..