Begin typing your search above and press return to search.

ఈ చక్కిలిగింతలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మోడీ?

By:  Tupaki Desk   |   3 May 2021 5:30 AM GMT
ఈ చక్కిలిగింతలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మోడీ?
X
అంతా బాగున్నట్లే ఉంటుంది కానీ.. తెలీని ఎటకారం తెలుగోళ్ల మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విలక్షణత మరే రాష్ట్ర ప్రజల్లోనూ కనిపించదు. ఆ మాటకు వస్తే.. తెలుగు ప్రజలకు హాస్యప్రియత్వం ఎక్కువ. మారే కాలానికి తగ్గట్లే.. దీనికి ఎటకారం యాడ్ అయ్యింది. వ్యంగ్య వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలుగు ప్రజలకు మించినట్లుగా తెలుగు రాష్ట్రాల్లోని కొందరు నేత తీరు ఉంటుంది. ఎలా వంట బట్టించుకున్నారో కానీ.. ప్రధాని మోడీ అప్పుడప్పుడు ఈ విషయంలో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎన్నికల వేళ.. ఎంతలా కోట్లాడతారో.. ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే పెద్దమనిషి తరహాలో వ్యాఖ్యలు చేయటం.. శుభాకాంక్షలు తెలియజేయటం మోడీకి ఉన్న అలవాట్లలో ఒకటి.

ఎన్నికల ప్రచార వేళలో.. విరుచుకుపడే మోడీ.. ఇప్పుడిలానా? అన్న సందేహం కలుగుతుంది కానీ.. ఆయన తీరు అంతే. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. ఆ మాటకు వస్తే.. బెంగాల్.. కేరళలో తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం కోసం మోడీషాలు పడిన తపన.. ఆరాటం.. అందులో భాగంగా వారు ప్రదర్శించిన అత్యుత్సాహం.. వారి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. తిరువనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభ దీనికి నిదర్శనం.

కరోనా వేళలో వేలాది మందిని ఒక చోటుకు చేర్చటం ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని పట్టించుకోకుండా.. రాజకీయ ప్రయోజనం ముందు మరేదీ ముఖ్యం కాదన్నట్లుగా ఆయన వ్యవహరించారు. ఈ తీరు దేశ ప్రజలు వేలెత్తి చూపించేలా చేసింది. మిగిలిన నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల క్షేమాన్ని పట్టించుకోకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. మోడీ లాంటి మనసున్న నేత ఈ తీరులో వ్యవహరించటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

తాజాగా వెల్లడైన ఫలితాల నేపథ్యంలో ఎప్పటిలానే.. వారందరికి శుభాకాంక్షల్ని తెలియజేశారు మోడీ. కేరళలో విజయన్ కు.. తమిళనాడులో స్టాలిన్ కు.. బెంగాల్ లో మమతకు అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని కార్యకర్తల సేవల్ని ప్రశంసించిన మోడీ.. ప్రజలు కరోనాను జయించేందుకు కేంద్రం సహకరిస్తుందన్న ట్వీట్ చూస్తే.. నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

నెల క్రితం రోజుకు నలభైవేల కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న దారుణ పరిస్థితి. జరగాల్సిందంతా జరిగిపోయినతర్వాత కరోనాను జయించటం ఏమిటన్న సందేహం రాక మానదు. చివర్లో తన మార్కు మిస్ కాకుండా ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. ఆయనలోని విలక్షణ రాజకీయ నేత ఇట్టే కనిపిస్తారు. తమిళ కల్చర్ ను మరింత పాపులర్ చేద్దామని ప్రస్తావించిన మోడీ ట్వీట్ చూసినప్పుడు.. తనకు ఎదురైన ఓటమిని పక్కాగా నోట్ చేసుకుంటున్నానన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లు అనిపించట్లేదు?