Begin typing your search above and press return to search.

బీజేపీలో ఇంత ఫ్రస్ట్రేషనా ?

By:  Tupaki Desk   |   25 Aug 2022 6:40 AM GMT
బీజేపీలో ఇంత ఫ్రస్ట్రేషనా ?
X
బీజేపీలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ దేనికి సంకేతం ? ఇపుడు పాతబస్తీలో, వరంగల్లాంటి కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లకు తొందరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికకు ఏమైనా కనెక్షన్ ఉందా ? ఇపుడిదే అందరిలో పెరిగిపోతున్న అనుమానాలు. విషయం ఎక్కడ మొదలైందంటే హైదరాబాద్ లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుకీ షో జరిగింది. ఆ షో జరగకూడదని గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్+ఆయన మద్దతుదారులు పట్టుబట్టారు.

తమ హెచ్చరికలను కాదని షో జరిగితే ఏం చేస్తామో తమకే తెలీదని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఎంఎల్ఏ హెచ్చరికలను ప్రభుత్వం, పోలీసులు లెక్కచేయలేదు. పైగా రాజాసింగ్ తో పాటు ఆయన మద్దతుదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మునావర్ షోకి సహకరించారు.

దాంతో రెచ్చిపోయిన రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంతో ముస్లింలు రెచ్చిపోయారు. ఒకవైపు ముస్లింలు, మరోవైపు బీజేపీ మద్దతుదారులు రెచ్చిపోయిన ఫలితమే ప్రస్తుత కర్ఫ్యూ వాతావరణం.

అవకాశం దొరికిన చోటల్లా రెండు వర్గాలు రెచ్చిపోతున్నాయి. వీళ్ళ గొడవల్లో సామాన్య జనాలు బలైపోతున్నారు. ప్రయాణీకులు వెళుతున్న కార్లు, బస్సులు, టెంపోలపైన బీజేపీ మద్దతుదారులు రెచ్చిపోయి అద్దాలు పగలగొడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. దాంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగటంతో పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం వచ్చేసింది.

ఈ నేపధ్యంలోనే గవర్నర్ తమిళిసై అర్జంటుగా ఢిల్లీకి వెళ్ళి హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవ్వటంతో తెరవెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే మునుగోడు ఉపఎన్నికలో నాన్ ముస్లిం ఓట్లన్నింటినీ బీజేపీకి అనుకూలంగా పోలరైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే ఇప్పటికైతే బీజేపీ గెలుపవకాశాలు తక్కువనే రిపోర్టులు అందుతున్నాయి. దాంతో ఎలాగైనా ఉపఎన్నికలో గెలిచితీరాలనే వ్యూహంతోనే బీజేపీ ఇదంతా చేయిస్తోందా అనే టాక్ పెరిగిపోతోంది.