Begin typing your search above and press return to search.

రండి... మాల్యాద్రి కుటుంబాన్ని ఆదుకుందాం!

By:  Tupaki Desk   |   7 Nov 2017 7:24 AM GMT
రండి... మాల్యాద్రి కుటుంబాన్ని ఆదుకుందాం!
X
కోటి ఆశ‌ల‌తో అమెరికాలో అడుగుపెట్టి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు వైపు శ‌ర‌వేగంగా దూసుకువెళుతున్న యువ ప్ర‌వాసాంధ్రుడు మాల్యాద్రి న‌న్న‌ప‌నేని... అనుకోని ప‌రిణామాల‌తో క‌న్నుమూశారు. ఉద్యోగం వెతుక్కుంటూ అమెరికాకు వ‌చ్చేసిన మాల్యాద్రి... అమెరికాలోని మిన్న‌సోటాలో త‌న కెరీర్‌ను ప్రారంభించ‌డ‌మే కాకుండా... అమెరికాలో ఉన్న ప్ర‌వాసాంధ్రుల్లో చురుకైన వ్య‌క్తిగా గుర్తింపు సంపాదించుకున్నారు. త‌న ఉద్యోగ నిర్వ‌హ‌ణ‌తో పాటుగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ చాలా చురుగ్గా పాలుపంచుకునే మాల్యాద్రి... ఎన్నారైల‌కు ఏ ఆప‌ద వ‌చ్చినా ముందు నిలిచే వ్య‌క్తిగా అక్క‌డి వారంద‌రికీ చిర‌ప‌ర‌చితులే. తాను ప‌నిచేసే చోట కూడా చురుకైన ఉద్యోగిగానూ గుర్తింపు సాధించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో అంచెలంచెలు ఎదుగుతున్న మాల్యాద్రి ఐదేళ్ల క్రితం శిరీష అనే యువ‌తితో పెళ్లి కాగా... ఆ దంప‌తుల‌కు ప్ర‌స్తుతం 15 నెల‌ల కుమారుడు నీహాల్ ఉన్నాడు.

భార్యా బిడ్డ‌ల‌తో సంతోషంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో మాల్యాద్రిని విధి వెంటాడింది. ఈ నెల 1న ఉన్న‌ట్టుండి గుండెపోటుకు గురైన మాల్యాద్రిని అక్క‌డి ప్ర‌వాసాంధ్రులు వెనువెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రి వైద్యులు కూడా త‌మ శాయ‌శ‌క్తులా మాల్యాద్రిని బ‌తికించేందుకు య‌త్నించారు. అయితే దుర‌దృష్ట‌వశాత్తు 33 ఏళ్ల వ‌య‌సు తీర‌కుండానే మాల్యాద్రి ఆసుప‌త్రిలోనే తుది శ్వాస విడిచారు. మాల్యాద్రి చ‌నిపోయార‌న్న వార్త‌తో ఆయ‌న భార్య‌ - త‌న స్వ‌స్థ‌లంలోని కుటుంబం ఒక్క‌సారిగా శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులే వేస్తున్న మాల్యాద్రి కుమారుడు నీహాల్ బంగారు భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ ప‌రిస్ధితిని గ‌మ‌నించిన అక్క‌డి ప్ర‌వాసాంధ్రులు వెనువెంట‌నే క‌దిలారు. అంతా మాట్లాడుకుని మాల్యాద్రి కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని ప్ర‌తిన‌బూనారు. అనుకున్న‌దే త‌డ‌వుగా చందాల వ‌సూలును ప్రారంభించారు.

మాల్యాద్రి మృత‌దేహాన్ని స్వ‌స్థ‌లానికి త‌ర‌లించ‌డంతో పాటుగా అంతిమ క్రియ‌లు నిర్వ‌హించ‌డం - మాల్యాద్రి చిన్నారి కుమారుడి విద్యాభ్యాసం త‌దిత‌రాల‌న్నింటికీ అవ‌స‌ర‌మ‌య్యే మేర చందాలు వ‌సూలు చేయాల‌ని త‌ల‌చిన ప్ర‌వాసాంధ్రులు... మొత్తంగా 1.5 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగానే అక్క‌డి ప్ర‌వాసాంధ్రుల త‌క్ష‌ణ స్పంద‌న‌తోనే ఇప్ప‌టికే 85 వేల డాల‌ర్ల మేర పోగయ్యాయి. ఇంకా సేక‌రించాల్సిన మొత్తానికి సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును వెతుక్కుంటూ అమెరికాకు వెళ్లి... అక్క‌డే క‌న్నుమూసిన మాల్యాద్రి... త‌న కుటుంబాన్ని ఒంట‌రి చేసి పోయార‌ని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అక్క‌డి ప్ర‌వాసాంధ్రులు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా అడిగిన వెంట‌నే మాల్యాద్రికి చేయూత అందించేందుకు ముందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మాల్యాద్రి కుటుంబానికి అందించాల‌ని ప్ర‌వాసాంధ్రులు నిర్దేశించుకున్న మేర విరాళాలు వీల‌యినంత త్వ‌ర‌గా అందాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.