Begin typing your search above and press return to search.

సోమ‌వారం బ్రిట‌న్ రాణి అంత్య‌క్రియ‌లు.. 71 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు..

By:  Tupaki Desk   |   18 Sep 2022 1:56 PM GMT
సోమ‌వారం బ్రిట‌న్ రాణి అంత్య‌క్రియ‌లు.. 71 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు..
X
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణికి ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు అశ్రునయనాలతో అంజలి ఘటించారు. రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు, రాజులు లండన్‌ చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాణికి భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించనున్నారు.

కాగా, బ్రిట‌న్ దేశ‌వ్యాప్తంగా 125 సినిమా థియేటర్లలో రాణి అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 మరకత మణులు, 269 ముత్యాలు, 4 రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని.. ప్రస్తుతం ఆమె శవపేటికపై ఉంచారు. ఇక‌, రాణి అంత్యక్రియలకు వ్యయం భారీగానే ఉండనుంది. బ్రిటన్ 9 మిలియన్ డాలర్లు(సుమారు రూ.71 కోట్లు) వెచ్చించనుంది. ఇతర దేశాధినేతల భద్రతా ఖర్చులు, కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం వంటి కార్యక్రమాలకు భారీగా వెచ్చించనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్ 8న రాణి ఎలిజబెత్-2 తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ను పాలించిన ఆమె.. 96 ఏళ్ల వయసులో కన్నుమూ శారు. పది రోజుల నుంచి యూకేలో సంతాప దినాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రాణి భౌతికకాయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చొని.. రాణికి తుది నివాళులు అర్పిస్తున్నారు.

వెస్ట్మినిస్టర్‌ హాల్‌లో ఉంచిన రాణి శవపేటికను రాయల్‌ నేవికి చెందిన గన్‌ క్యారేజ్‌లో సోమవారం వెస్ట్‌ మినిస్టర్‌ అబేకు తీసుకొ స్తారు. అక్కడ వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరుగుతాయి. కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ.. సంతాప ప్రసంగాన్ని ఇస్తారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ కూడా ప్రసంగిస్తారు. వీరి ప్రసంగాలు పూర్తయిన తర్వాత రాణి శవపేటికను వెస్ట్‌ మినిస్టర్‌ అబే నుంచి లండన్ హైడ్ పార్క్ కార్నర్‌లోని వెల్లింగ్టన్ ఆర్చ్‌కు తీసుకొస్తారు.

అక్కడి నుంచి విండ్సర్స్‌ క్యాజిల్‌కు అంతిమయాత్రగా తీసుకెళ్తారు. ఈ అంతిమ యాత్రలో కింగ్‌ ఛార్లెస్‌ 3తోపాటు రాజ కుటుంబం కూడా పాల్గొంటుంది. సోమవారం మధ్యాహ్నం చివరగా విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి శవపేటికను తీసుకువస్తారు. ఈ సెయింట్‌ జార్జ్‌ ఛాపెల్‌లోనే రాజ కుటుంబ వివాహాలు, అంత్యక్రియలు, క్రైస్తవ మత స్వీకరణ లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడే ప్రిన్స్ హ్యారీ, మేఘన్ పెళ్లి జరగగా.. క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ఫిలిప్ అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగాయి.

సెయింట్ జార్జ్ చాపెల్‌లోని కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్‌లో రాణి శవపేటిక ను ఉంచుతారు. క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచుతారు. రాణి అంత్యక్రియల సందర్భంగా బ్రిటన్‌లో సోమవారం సెలవు ప్రకటించారు. అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శిస్తారు. రాణి అంత్యక్రియలకు రెండు వేల మంది ప్రముఖులు, అతిథులు హాజరు కానున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వివిధ దేశాధినేతలు సహా కరోనా సమయంలో సేవలు అందించిన సాధారణ బ్రిటన్వాసులు సైతం అతిథుల జాబితాలో ఉన్నారు. 5,949 మంది సైనిక సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4,416 మంది ఆర్మీ, 847 మంది నేవీ, 686 మంది ఎయిర్ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. కామన్వెల్త్ దేశాల నుంచి 175 మంది హాజరయ్యారు.

వెస్ట్ మినిస్టర్ అబే నుంచి వెల్లింగ్టన్ ఆర్చ్ వరకు సాగే రాణి అంతిమ యాత్రలో 1,650 మంది సైనికులు పాల్గొంటారు. పది వేల మందికి పైగా పోలీసు అధికారులు లండన్లో విధులు నిర్వర్తించనున్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ చరిత్రలో ఇంతమందిని రంగంలోకి దించడం ఇదే తొలిసారి. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో దాదాపు 10 వేల మంది విధుల్లో ఉన్నారు.

రాణిని చూసేందుకు వస్తున్న ప్రజలను నియంత్రించేందుకు లండన్లో 36 కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్, వెస్ట్మినిస్టర్ అబే, బకింగ్హమ్ ప్యాలెస్ పరిసరాల్లో వీటిని నెలకొల్పారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యం కోసం 250 అదనపు రైళ్లను నడిపిస్తున్నారు. క్వీన్ భౌతికకాయం ఉంచిన వెస్ట్మినిస్టర్ హాల్ బయట ప్రజలు 8 కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు.