Begin typing your search above and press return to search.

గుర్తుపట్ట రాని విధంగా మారిన రాహుల్

By:  Tupaki Desk   |   11 April 2015 7:02 AM GMT
గుర్తుపట్ట రాని విధంగా మారిన రాహుల్
X

రాహుల్ గాంధీ... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, భవిష్యత్ నేత. అయితే సుదీర్ఘ సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ ఎప్పుడొస్తారో...ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఏప్రిల్ లో వచ్చేస్తారని రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గత నెలలో ప్రకటించినప్పటికీ రెండో వారం ప్రారంభం అయినా ఇంకా ఆయన అడ్రస్ లేరు. మరోవైపు కరడుగట్టిన కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబ విధేయుడు అయిన దిగ్విజయ్ సింగ్ సైతం రాహుల్ ఇన్నాళ్లు సెలవుపై వెళ్లడం సరికాదన్నారు. ఈ విధంగా రాహుల్ అకస్మిక సెలవు దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది.

రాహుల్ సెలవు విషయంలో అంతర్జాతీయ మీడియాలో ఓ కార్టున్ ప్రచురితం అయింది. విమానాశ్రయంలోని అరైవల్స్ వద్ద ఓ వ్యక్తి ప్లకార్డు పట్టుకొని ఉంటారు అందులో రాహుల్ గాంధీ అని రాసి ఉంటుంది. పక్కనున్న వాళ్లతో ఆయన.. రాహుల్ గాంధీని చూసి చాలాకాలం గడిచిపోయింది. ఇపుడు ఎలా ఉంటారో గుర్తుపట్టలేం అందుకే ఇలా అంటూ...చెప్తారు!! ఈ కార్టున్ కేవలం ఆ పత్రికలోనే కాదు..ఇపుడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.

ఆయన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోకముందే ఈ రకంగా చెప్పినమాటపై నిలబడకపోతే.. ఒకవేళ భవిష్యత్ లో పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఈ విధంగానే వ్యవహరిస్తే ఎలా అని కాంగ్రెస్ శ్రేణులు మథనపడుతున్నాయి.

మరోవైపు బీఆర్ అంబేద్కర్ వేడుకలు ఏడాదిపాటు నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీని ఆ కమిటీకి అధ్యక్షురాలిగా, రాహుల్ ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నెల 13న ఆ కమిటీ తొలి సారి సమావేశం కానుంది. అప్పటికైనా ఆయన ఢిల్లీ చేరుకుంటారా అనే సందేహం హస్తం శ్రేణుల్లో నలుగుతోంది.