Begin typing your search above and press return to search.

ఏపీకి ప్ర‌త్యేక హోదా..ఆంధ్రులకు ఇంకో ఆప్ష‌న్‌

By:  Tupaki Desk   |   10 Jun 2018 5:00 PM GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా..ఆంధ్రులకు ఇంకో ఆప్ష‌న్‌
X
ఏపీలో ప్ర‌త్యేక హోదా అంశం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆయా రాజకీయ పార్టీలు త‌మ వైపు ఈ అంశం కోసం గ‌ళం వినిపిస్తుండ‌గా తాజాగా హోదా సాధన సమితి ఇంకో కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తెచ్చింది. విజయవాడలో ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి సమావేశమైంది.ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టివ‌ర‌కు హోదా సాగిన తీరు - ఇక ముందు సాగాల్సిన విధానం - కేంద్రం చ‌ర్య‌లు - భ‌విష్య‌త్‌ లో ఆందోళ‌న రూపాలు వంటి వాటిపై స‌వివ‌ర చ‌ర్చ జ‌రిగింది. అనంత‌రం సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ లబ్దికోసమే కేంద్రాన్ని.. మోడీని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని హామీలను నెరవేరుస్తున్నామని బీజేపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం విభజన హామీలు ఏ మేరకు నెరవేర్చిందో ఆ పార్టీ నాయకులు చెప్పాలని రామకృష్ణ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పొందుపరిచిన అంశాలు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా నెరవేర్చలేదని ఈ సందర్భంగా రామకృష్ణ విమర్శించారు. బీజేపీ నాయకులు 85 శాతం విభజన హామీలు అమలు చేసినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని.. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని చెప్పి.. 350 కోట్లు ఇచ్చి - మళ్లీ వెనక్కి తీసుకోవడం కేంద్రం ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో.. నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని రామకృష్ణ ప్రశ్నించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారని - ఇంత వరకు అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగలేదని ఆయన వెల్లడించారు.

ప్ర‌త్యేక హోదా నేత చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమం పడిపోలేదని - ప్రజల గుండెల్లో సజీవంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు పోరాడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీ ఆంధ్రా ద్రోహుల పార్టీ అని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రజలు తమకు జరిగిన అన్యాయన్ని మరిచిపోలేక పోతున్నారని అన్నారు. జూలై నుంచి రాష్ట్రవాప్తంగా పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేశామని చలసాని శ్రీనివాస్ తెలిపారు. విడివిడిగా ఉద్యమాలు చేస్తుంటే ఢిల్లీ నేతలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్ళుగా సాధన‌ సమితి పోరాడుతూనే ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం వేర్వేరుగా ఉద్యమాలు చేస్తుంటే ఢిల్లీ నేతలు నవ్వుతున్నారని.. అందరం కలిసి ఉద్యమాలు చేద్దామని చలసాని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి వరకు ఉన్న సాధన సమితి కార్యవర్గాన్ని.. పది లక్షల కరపత్రాల ప్రచురణతో మండలాలకు విస్తరిస్తామన్నారు. జూన్‌ 15 తర్వాత విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని చలసాని శ్రీనివాస్ అన్నారు. జులైలో విశ్వ విద్యాలయాల్లో బస్సుయాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తామమని తెలిపారు. నెలలో ఒకరోజు ర్యాలీలు, 24 గంటల పాటు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా నిలబడే వారందరితో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎవరైతే ఉద్యమాలకు రారో.. వారు ద్రోహులుగా మిగిలిపోతారని చలసాని శ్రీనివాస్ అన్నారు.